YuvaGalam: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర
ABN , First Publish Date - 2023-04-28T10:27:24+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara lokesh YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. 82 రోజులుగా లోకేష్ చేస్తున్న పాదయాత్రకు (Lokesh Padayatra) విశేష ఆదరణ లభిస్తోంది. అడుగడుగునా లోకేష్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం మంత్రాలయం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి అయింది. కాసేపటి క్రితమే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజవర్గాల్లో పాదయాత్ర చేసిన లోకేష్ ఆయా సామాజిక వర్గాలు, రైతులు, ప్రజలు, యువత చెప్పిన సమస్యలను సామరస్యంగా వింటూ టీడీపీ ప్రభుత్వం రాగానే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం విడిది కేంద్రం నుంచి 83వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. కాసేపటికే మంత్రాలయం నియోజకవర్గంలో పూర్తై ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. దీంతో లోకేష్‌కు టీడీపీ ఇన్‌చార్జ్ బీవీ.జయ నాగేశ్వర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు పాదయాత్ర చేస్తున్న యువనేతను మంత్రాలయం నియోజకవర్గం కల్లుదేవకుంట గ్రామస్తులు కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న సిమెంటు రోడ్లు టీడీపీ హయాంలో నిర్మించినవేనని యువనేతకు చూపి కృతజ్ఞతలు తెలియజేశారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఓవర్ హెడ్ ట్యాంక్ మంజూరు చేయాలని కోరారు. సాగునీటి సమస్య పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలన్నారు. అలాగే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని వినతి చేశారు. పీహెచ్‌సీలో డాక్టర్, రెగ్యులర్ స్టాఫ్‌ను నియమించాలని యువనేతను గ్రామస్తులు కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక గ్రామసీమలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనిమండిపడ్డారు. గ్రామపంచాయితీలకు చెందిన రూ.8660 కోట్లు దొంగిలించారని ఆరోపించారు. తాను పంచాయితీరాజ్ మంత్రిగా ఉన్నపుడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో డ్రైనేజీ, ఇతర సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని లోకేష్ తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం ఎమ్మిగనూరు నియోజకవర్గం మాచాపురంలో రైతులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ పాల్గొననున్నారు.