YuvaGalam: లోకేష్ కోసం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చిన మహిళలు.. ఆదోని టౌన్‌లోకి యువగళం
ABN , First Publish Date - 2023-04-21T12:05:29+05:30 IST
డీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఆదోని టౌన్‌లోకి చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ఆదోని టౌన్‌లోకి చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర ఆదోని టౌన్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌ను (Nara Lokesh) చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. పన్నుల భారంతో బతుకు భారంగా మారిందని లోకేష్‌కు (TDP Leader) మహిళలు తమ బాధను చెప్పుకున్నారు. ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందని యువత ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మహిళలకు లోకేష్ అభయమిచ్చారు. స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువతకు లోకేష్ హామీ ఇచ్చారు.
ఆదోని బైపాస్ బాధితుల వినతిపత్రం
అనంతరం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను ఆదోని బైపాస్ బాధితులు కలిసి వినతిపత్రం అందజేశారు. నేషనల్ హైవే 167లో భాగంగా ప్రతిపాదించిన ఆదోని బైపాస్ రోడ్డు ఎలైన్ మెంట్ -2 ఆదోని పట్టణ మాస్టర్ ప్లాన్‌కు విరుద్దమైనదని తెలిపారు. దీనివల్ల 40 సంవత్సరాల క్రితం ఆమోదించిన లేఅవుట్లు, ఆవాసాలు దెబ్బతిని, 40 ఏళ్ల నుంచి ఉంటున్న 400 కుటుంబాలను ప్రభావితం చేస్తోందన్నారు. కేవలం కొద్దిపాటి వ్యవసాయ భూములు మాత్రమే ప్రభావితమయ్యే ఎలైన్ మెంట్ - 3ని పరిగణనలోకి తీసుకొని బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే, ఆయన మనుషులకు చెందిన భూములకు విలువ పెంచుకునేందుకు, ఆ భూములకు సమీపం గుండా జాతీయరహదారి వెళ్లేలా ఎలైన్ మార్పులు చేస్తున్నారని తెలిపారు. ఆదోని పట్టణంలో 4 దశాబ్ధాలుగా నివసించే ప్రజలకు నష్టం జరగకుండా ఎలైన్ మెంట్ -3 ప్రకారం బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు.
యువనేత నారా లోకేష్ స్పందిస్తూ... వైసీపీ నేతలు వారి స్వార్థం కోసం ఎన్ని వందలమంది ప్రయోజనాలైనా దెబ్బతీయడానికి వెనకాడటం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల భూములు రేట్లు పెంచుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెట్టడం దారుణమన్నారు. ఆదోని మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా ఎలైన్ మెంట్ మార్పుపై హైవే అథారిటీకి లేఖరాస్తామని చెప్పారు. ఆదోని బైపాస్ రోడ్డు బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా నిలుస్తామని యువనేత హామీ ఇచ్చారు.