Avinash Reddy : ‘సునీత, చంద్రబాబు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కుమ్మక్కయ్యారు’..

ABN , First Publish Date - 2023-04-17T12:46:13+05:30 IST

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ ఫిటిషన్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Avinash Reddy : ‘సునీత, చంద్రబాబు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కుమ్మక్కయ్యారు’..

హైదరాబాద్: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) లంచ్ మోషన్ పిటిషన్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు (Avinash Reddy CBI Enquiry) జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నేడు అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌లో తనకు 160 సీఆర్‌పీసీ కింద నోటీస్ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే 161 సీఆర్‌పీసీ కింద సీబీఐ అధికారులు తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు.

వివేక కూతురు సునీత, స్థానిక ఎమ్మెల్సీ ద్వారా టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు, సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కుమ్మక్కు అయ్యారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో తనను కుట్ర పన్ని ఇరికిస్తున్నారన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుని అభ్యర్థించారు. కేవలం గూగుల్ టే కౌట్ ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజుల పాటు సీబీఐ తన వద్ద ఉంచుకుందన్నారు. అక్కడే అతడిని అప్రూవర్‌గా మార్చారని పేర్కొన్నారు. ఈ కేసులో తనపై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దస్తగిరి స్టేట్మెంట్ ఒక్కటే ప్రామాణికంగా సీబీఐ తీసుకుందన్నారు.

లంచ్ మోషన్ పిటిషన్‌లో ఇంకా ఏఏ అంశాలను అవినాష్ రెడ్డి ప్రస్తావించారంటే..

‘‘ఈ కేసులో ఇప్పటి వరకూ నేను నిందితుడిగా లేను. 2021లో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో నన్ను అనుమానితుడిగా చేర్చారు. నాపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. రెండో భార్య కొడుకుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని రెండో భార్యకు వివేకా హామీ ఇచ్చారు. వివేకా తన రెండో భార్యకూ ఆర్థిక వ్యవహారాల్లో పాలు పంచుకునేందుకు అవకాశం ఇవ్వడంతో మొదటి భార్య కుమార్తె అయిన సునీత తండ్రిపై కక్ష గట్టింది. ఆర్థిక లావాదేవీల్లో రెండో భార్య ప్రమేయం ఎక్కువ కావడంతో సునీత తన తండ్రి వివేకాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా చెక్ పవర్‌ను కూడా సునీత తొలగించింది. డబ్బు కోసం బెంగుళూరులో వివేకా ల్యాండ్ సెటిల్మెంట్స్ చేశారు. నిందితులతో కలిసి డైమండ్స్ వ్యాపారం చేశారు. ఇద్దరు నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధం ఉంది’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-17T17:08:34+05:30 IST