Purandeshwari: తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదు.. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ABN , First Publish Date - 2023-11-20T12:52:03+05:30 IST
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీకి స్పష్టత ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన మోదీ చేశారని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందన్నారు.
ప్రకాశం: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే (PM Modi) దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీకి స్పష్టత ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన మోదీ చేశారని తెలిపారు. దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందన్నారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దేవుడి విగ్రహాల నుంచి, గర్భ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారన్నారు. మోదీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విపక్షాలపై జరుగుతున్న దాడులు అందరికీ తెలుసన్నారు. ఎస్సీ, బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదని ఏపీ బీజేపీ చీఫ్ తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా అమలు కాకుండా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తోందని.. కరువు మండలాలపై సీఎం జగన్ శీతకన్ను వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాల్లో బీజేపీ ప్రతినిధులు తిరిగి అధ్యయనం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. టీటీడీలో అన్యమతస్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారని.. టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మున్సిపల్ శాఖ మీద వచ్చే ఆదాయాన్ని ఎందుకు దారి మళ్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగి పోయి పరాకాష్టకు చేరిందన్నారు. గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారన్నారు. సర్పంచ్లకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగినా తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదని.. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.