Dharmana Prasada Rao: ఈ నాలుగేళ్లలో అద్భుతాలు సృష్టించాం
ABN , First Publish Date - 2023-08-12T16:37:58+05:30 IST
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఎవరిని ప్రశ్నించాలి. ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి మీరు బాధ్యులు కాదా?, 14 ఏళ్లు సీఎంగా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పగలరా?, నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై నిందలు వేస్తారా?
శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రాజెక్టుల సందర్శనపై మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు (Dharmana Prasada Rao) స్పందించారు. ప్రాజెక్టుల దగ్గరకు వచ్చేటప్పుడు చంద్రబాబు కనీస అవగాహనతో వచ్చి ఉంటే బాగుండేదని సూచించారు. మంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడారు. ‘‘14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఎవరిని ప్రశ్నించాలి. ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి మీరు బాధ్యులు కాదా?, 14 ఏళ్లు సీఎంగా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశానని చెప్పగలరా?, నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై నిందలు వేస్తారా?, వంశధార 77 శాతం పనులు పూర్తయ్యాయి. డిసెంబర్‌లో జాతికి అంకితం చేస్తాం.’’ అని మంత్రి తెలిపారు.
‘‘టీడీపీ హయాంలో వంశధార కేవలం 23 శాతం పనులు మాత్రమే చేశారు. ఒడిస్సాతో ఉన్న వివాదం పరిస్కారానికి సీఎం జగన్ (CM jagan) అక్కడి ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపారు. టీడీపీ హయాంలో ఒడిస్సాతో ఉన్న వివాదానికి పరిస్కారం ఆలోచించారా?, ఉద్దానం సమస్య పరిస్కారానికి చంద్రబాబు ఏం చేశారు?, కిడ్నీ వ్యాధుల నిర్మూలణకు వంశధార నుంచి ఉద్దానంకు మంచినీరు అందించాలని కృషి చేశాం. నాలుగేళ్లలో ఒక్క కిడ్నీ సమస్య బయటకు రాలేదు. అబబద్ధాలకు ఒక హద్దు ఉండాలి. టీడీపీ ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాకు ఒక్క జాతీయ సంస్థ తెచ్చారా?, సిక్కోలుపై ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారు. తోటపల్లి 90 శాతం పనులు రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు. కేవలం దోపిడీ కోసమే నదుల అనుసంధానం. ఉత్తరాంధ్రలో ఒక్క పని చేశామని చంద్రబాబుకు చెప్పమనండి. మళ్లీ అధికారంలోకి వస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం చేస్తామంటున్నారు. విధ్వంసం అనే మాటను చంద్రబాబు ఉపసంహరించుకోవాలి. నాలుగేళ్లలో అద్భుతాలు సృష్టించాం. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ బోకు పనులే. నీరు చెట్టు పేరుతో దోపిడీ చేశారు. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరు. గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు. అధికారంలోకి వస్తే చంద్రబాబు విద్యుత్ చార్జీలు తగ్గిస్తాడట. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ప్రాజెక్టులపై ఇన్వెస్ట్మెంట్ దండగ అన్న వ్యక్తి బాబు. ఆయన మనసులో మాట పుస్తకంలో ఉంది.’’ అని మంత్రి గుర్తుచేశారు.