Tammineni Sitaram: చంద్రబాబును చంపితే మాకేం వస్తుంది
ABN , First Publish Date - 2023-10-17T12:50:27+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబును చంపితే తమకేం వస్తుందని.. ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే అని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం: టీడీపీ అధినేత చంద్రబాబును (TDP Chief Chandrababu naidu) చంపితే తమకేం వస్తుందని.. ఆయన ఎక్కడ ఉన్నా ఒక్కటే అని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Speaker Tammineni Sitaram) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జైలులో సదుపాయాలపై కోర్టు ద్వారా వారు ఏమి కోరుతున్నారో అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దేశంలోని నేరగాళ్లకు ఎలాగో చంద్రబాబుకి అలాగే అని స్పష్టం చేశారు. అతను ఆర్థిక నేరగాడు.. మహాత్మా గాంధీనా, నెహ్రూ నా...? అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ పని క్లోజ్ అయిపోయిందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై వాళ్ళు ఇన్ని చేస్తున్నా, సామాన్య ప్రజలలో ఏమి స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఆర్థిక నేరగాళ్లకు ప్రజలు సపోర్ట్ చేయరన్నారు. 16 నెలలు జగన్‌ను జైలులో పెట్టారని... కేసులో ఏం నిరూపించుకోలేకపోయారన్నారు. ఎంపీ స్థానానికి పోటీ విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫాలో అవుతానని తెలిపారు. తమ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. టీడీపీ, జనసేన, బీజేపీలు దమ్మున్న పార్టీలయితే అన్ని స్థానాల్లో ఆయా పార్టీలు పోటీ చేయాలని సవాల్ విసిరారు. ‘‘ఎంత మంది కలసి వచ్చినా ఓకే.. సీఎం జగన్ సింహం... సింహం సింగిల్‌గానే వస్తుంది’’ అంటూ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.