Devineni Uma: చిన్నారిని చంపిన చిరుత దొరికింది.. బాబాయ్‌ను చంపిన చిన్నోడు దొరకలేదు
ABN , First Publish Date - 2023-08-17T13:38:28+05:30 IST
తిరుమల తిరుపతి పవిత్రతపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా: తిరుమల తిరుపతి పవిత్రతపై వైసీపీ ప్రభుత్వం (YCP Government) వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (TDP Leader Devineni Umamaheshwar rao) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... సైకో ప్రభుత్వం సైకో చేష్టలు చివరి స్టేజ్‌కు చేరుకున్నాయన్నారు. ‘‘చిన్నారిని చంపిన చిరుత దొరికిందని.. బాబాయ్‌ను చంపిన చిన్నోడు దొరకలేదు, చంపించిన వాడు చక్కని చిరునవ్వుతో తిరుగుతున్నాడు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి (CM Jagan) పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. తిరుపతి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతిసేలా టీటీడీ ప్రవర్తిస్తోందన్నారు. మూర్ఖత్వపు ప్రభుత్వం, జగన్ రెడ్డిని అడుగుతున్నా.. శబరిమలలో జంతువులు లేవా?, అక్కడ భక్తులను ప్రభుత్వం కాపాడుకోవడం లేదా అని ప్రశ్నించారు. తిరుమల వచ్చే భక్తులను వైసీపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా భయపెడుతోందని, భక్తుల మనోభావాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు. నడక మార్గం మూసివేస్తామని లీకేజీలు ఇస్తారా? అని ప్రశ్నించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైవీ సుబ్బారెడ్డి సమయంలోనే ఎన్నో కుట్రలు జరిగాయని... ఇప్పుడున్న చైర్మన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. జంతువులను పారదోలడానికి తీసుకోవాల్సిన చర్యలు మానివేసి, భక్తులకు కర్రలు ఇవ్వడం విడ్డురంగా ఉందని టీడీపీ నేత వ్యాఖ్యలు చేశారు.
జగన్, సజ్జల గుర్తుపెట్టుకోండి...
కేబినెట్ మంత్రి రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తడం, మీ కక్కుర్తికి అద్దం పడుతోందన్నారు. యువగళం పాదయాత్ర బ్యానర్‌లు తీసివేస్తున్నారని.. జెండాలు కట్టవద్దన్నారని.. భోజనాలు పెట్టేవాళ్ళను, రైతులను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్, సజ్జల గుర్తు పెట్టుకోండి, మీరు ఎమ్మెల్యే లతో ఎంత తిట్టించిన, బెదిరించిన యువగళం పాదయాత్ర ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతం అవుతోంది. యువగళం పాదయాత్ర లో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు అందరూ భాగస్వామ్యులు కాబోతున్నారు. పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొనాలి. ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి ఉదయం నుంచి బయటకు రానివ్వలేదు. నందిగామ ఏమైన నిషేధిత ప్రాంతంలో ఉందా? సజ్జల. దేశ మహానుభావుల విగ్రహాలను నందిగామ మున్సిపల్ కార్యాలయం మరుగుదొడ్లు వద్ద పడేశారు. వైసీపీ నాయకుల సైకో చేష్టలు, అవినీతి పరుడైన మున్సిపల్ కమీషనర్‌తో కోర్ట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని తొలగించడం దారుణం. మాజీ ఎమ్మెల్యేను వైసీపీ గుండాలు, నాయకులు ఇష్టం వచ్చినట్లు దుర్భాషాలాడారు. మున్సిపల్ డబ్బులు రూ.18 లక్షలు ఖర్చు పెట్టి మహనేత విగ్రహాన్ని 25 అడుగులు ఎత్తులో పెట్టారు. వైఎస్ విగ్రహం అడ్డం లేదా? జాతీయ నాయకులు విగ్రహాలు తీసివేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విగ్రహాలను మరలా నందిగామ కూడలిలో ఏర్పాటు చేస్తాము. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్ కమీషనర్‌లు చేసిన పాపాలకు ప్రజలకు సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అన్న కాంటీన్‌లలో 7.25 కోట్ల మంది భోజనం చేసారు. జగన్ రెడ్డి వచ్చి అన్నకాంటీన్‌లు ఎత్తేశారు. ఎవరు పెత్తందారులు జగన్ రెడ్డి. పేదవాడు ఒక పూట భోజనం చేయకూడదని అన్న కాంటీన్‌లు తీసివేసిన ఘనుడు జగన్ రెడ్డి. రుషికొండపై విల్లా కట్టుకొని సముద్రంలో విహార యాత్ర చేయడానికి పెత్తందరు జగన్ రెడ్డి విశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నాడు. ప్రజలు కట్టే పన్నులతో మీ భోగాలేంటి పెత్తందారు జగన్ రెడ్డి. మీ తప్పులను ఎత్తి చూపుతున్నానని నా బెయిల్ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తానని సజ్జల వాగుతున్నాడు’’ అంటూ దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.