TDP: అందరూ బటన్ నొక్కుడు స్కామ్‌లో పాత్రధారులే.. ప్రభుత్వంపై దేవినేని ఫైర్
ABN , First Publish Date - 2023-04-26T15:52:06+05:30 IST
ప్రభుత్వం అందిస్తోన్న డీబీటీ స్కీముల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణలు గుప్పించారు.
అమరావతి: ప్రభుత్వం అందిస్తోన్న డీబీటీ స్కీముల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా (Former Minister Devineni Umamaheshwar Rao) ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ (CM Jagan mohan Reddy) బటన్ నొక్కుడు పేరుతో వేల కోట్లు బొక్కేస్తున్నారన్నారు. ప్రజల ఖాతాల్లోకి వెళ్లాల్సిన సొమ్ము గ్రామ సచివాలయాల ద్వారా తిరిగి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతోందని విమర్శించారు. సజ్జల, ఐఏఎస్‌లు ధనుంజయ రెడ్డి, రావత్, సత్యనారాయణ అందరూ బటన్ నొక్కుడు స్కామ్‌లో పాత్రధారులే అని ఆరోపించారు. బటన్ నొక్కుడు బాగోతానికి సంబంధించి వారంతా ఏదో ఒకనాడు జైలుపాలు కాక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు, కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మట్టి, గ్రావెల్ కుంభకోణంలో మునిగి తేలుతున్నారని మండిపడ్డారు. పోలవరం కుడి కాలువ కేంద్రంగా రూ.870 కోట్ల విలువైన రూ. 6 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి, గ్రావెల్ తవ్వకాలు, రవాణా, అమ్మకాలపై సీఎం జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్‌కు వస్తున్నదెంత అని ప్రశ్నించారు. మంత్రి అంబటి, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, వల్లభనేని వంశీ, ఎంపీ నందిగం సురేశ్ ఇప్పటి వరకు కొట్టేసింది ఎంత అని నిలదీశారు. పోలవరం కుడి కాలువతో పాటు, అటవీ, అసైన్డ్ భూముల్లో జరిగే గ్రావెల్, మట్టి మాఫియా మొత్తం సీఎం కనుసన్నల్లో జరుగుతోందని వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలను కాదని బరితెగించి మట్టి, గ్రావెల్ తవ్వకాలు జరిపే ధైర్యం మంత్రికి, ఎమ్మెల్యేలు, వారి అనుచరులకు ఎవరిచ్చారంటూ దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.