Nara Lokesh: యువగళం సాగనిస్తే పాదయాత్ర.. లేదంటే దండయాత్రే.. జగన్‌పై విరుచుకుపడ్డ లోకేష్
ABN , First Publish Date - 2023-08-22T20:43:05+05:30 IST
సీఎం జగన్ ఓ పిరికి వ్యక్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు.
గన్నవరం: సీఎం జగన్ ఓ పిరికి వ్యక్తి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం సాగనిస్తే పాదయాత్ర అని, లేదంటే దండయాత్రేనని హెచ్చరించారు. గన్నవరంలో జరిగిన టీడీపీ గర్జన సభలో సీఎం జగన్‌పై లోకేష్ విమర్శల వర్షం గుప్పించారు. యువగళం ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీకి భయం పట్టుకుందని, తాను పాదయాత్ర చేస్తుంటే జగన్‌కు కాళ్లు నొప్పిపెడుతున్నాయని ఆయన తెలిపారు. భయం అనేది తమ బ్లడ్‌లోనే లేదని నారా లోకేశ్ చెప్పారు. జగన్‌లా తాను వారానికి 3 రోజులు సెలవు పెట్టడం లేదన్నారు. జగన్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల పొట్టలు కొట్టి కోటలు కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల నడకదారిలో బాలికపై పులి దాడిచేస్తే, వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడి, అవమానించారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘జగన్ పాలనలో ఇసుక మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. ఇసుక ద్వారా జగన్ రూ.5,400 కోట్లు జగన్ దోచేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక ధరలు తగ్గిస్తాం. భవన నిర్మాణ కార్మికుల్ని అన్నివిధాల ఆదుకుంటాం. తిరుమలలో చిరుతలను తరిమేందుకు కర్రల పథకం తేవడం అనాలోచిత నిర్ణయం. తాడేపల్లి ప్యాలెస్‌లోకి ఓ పులిని వదిలితే కర్రతో జగన్ ఆ పులిని తరుమగలడా? రానున్న రోజుల్లో పీల్చే గాలిపైన కూడా జగన్ పన్ను వేస్తారు.’’ అని నారా లోకేష్ అన్నారు.