AP MLC Results: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా
ABN , First Publish Date - 2023-03-17T10:35:30+05:30 IST
ఏపీలో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
విశాఖపట్నం: ఏపీ (Andhrapradesh)లో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ఉత్తరాంధ్ర, తూర్పుసీమల్లో టీడీపీ (TDP) ఆధిక్యంలో ఉండగా.. పశ్చిమసీమ స్థానంలో వైసీపీ (YCP) స్వల్ప మెజారిటీతో ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. వరుసగా నాలుగు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు (TDP candidate Vepada Chiranjeevi Rao) ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఐదో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. అన్ని రౌండ్లలోనూ టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలోనూ టీడీపీ ఆధిక్యత ప్రదర్శించింది. నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి చిరంజీవిరావు 3704 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. నాలుగు రౌండ్‌లో మొత్తం 28005 ఓట్ల లెక్కింపు జరిగింది. టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 11517 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి సుధాకర్‌కు 7813 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 4788 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు 1563 ఓట్లు వచ్చాయి. అలాగే 1688 ఇన్వాలిడ్ ఓట్లు వచ్చారు. మొత్తం నాలుగు రౌండ్లు కలిపి చిరంజీవి రావుకు 16981 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
తొలి ప్రాధాన్య ఓటుతోనే గెలుస్తా...
తొలి ప్రాధాన్యత ఓటుతోనే టీడీపీ అభ్యర్థిగా గెలుస్తానని చిరంజీవి రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏబీఎన్‌తో మాట్లాడుతూ... ప్రస్తుతం వరుసగా నాలుగు రౌండ్స్‌లో తాను ఆధిక్యంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ 5 నుంచి 10 వేల ఓట్లు తగ్గితే... రెండో ప్రాధాన్యత ఓటు అవసరం పడవచ్చని చెప్పారు. అప్పుడు కుడా తాను గెలుస్తానని నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. తనలాంటి వ్యక్తి ఎగువ సభకు వెళ్తే.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ప్రభుత్వంపై పట్టభద్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటర్లు ఎవరూ లొంగలేదని తెలిపారు. తుది ఫలితం రావడానికి కొంత ఆలస్యం కావచ్చని చిరంజీవి రావు పేర్కొన్నారు.
తూర్పు రాయలసీమలో టీడీపీ ఆధిక్యం
అటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ (TDP candidate Kancharla Srikanth) 13,215 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 2.70లక్షల ఓట్లు పోలయ్యాయి. ఒక్కోరౌండ్‌కు 40వేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. అందులో ప్రతీరౌండ్‌లోనూ దాదాపు మూడువేల ఇన్వాలిడ్ ఓట్లు వస్తున్నాయి. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. సాయంత్రం 5 గంటలలోపు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 44.56 శాతం ఓట్లు కంచర్ల శ్రీకాంత్‌కు వచ్చాయి. ఈ క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే శ్రీకాంత్ గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.