South Groupలో కీలక పాత్ర పోషించిన ఎంపీ తనయుడు

ABN , First Publish Date - 2023-02-11T09:46:00+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

South Groupలో కీలక పాత్ర పోషించిన ఎంపీ తనయుడు

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల పంజాబ్‌కు సంబంధించి ఛారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును సైతం అరెస్ట్ చేసింది. నిన్న రాఘవరెడ్డిని విచారించిన ఈడీ అధికారులు సాయంత్రానికి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడు అధికారికంగా ఆయన అరెస్ట్‌ను ప్రకటించారు. నేడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు.

సౌత్ గ్రూప్‌లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అన్ని మీటింగ్‌ల్లోనూ మాగుంట పాల్గొన్నట్టు సమాచారం. విచారణలో రాఘవరెడ్డి చాలా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక నుంచి పెద్ద వాళ్లను కూడా ఈడీ అధికారులు విచారించనున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు అరెస్ట్‌తో ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

వరుస అరెస్ట్‌లు చూస్తుంటే ఇక మున్ముందు కీలక వ్యక్తుల అరెస్ట్‌లు ఉండబోతున్నాయనేది అర్ధమవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన చార్జిషీట్‌లో రోజుకో కొత్త పేరును అధికారులు యాడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పెద్ద ట్విస్ట్‌ను ఈడీ అధికారులు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రెండో చార్జీషీట్‌లో కీలక వ్యక్తుల పేర్లను అధికారులు చేర్చారు. ఏకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును ప్రస్తావించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎక్సైజ్‌ పాలసీ రూపొందించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన విజయ్‌ నాయర్‌తో మాట్లాడినట్లు ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ను మొత్తం నడిపించింది విజయ్‌ నాయరే అని కూడా స్పష్టం చేసింది. ఈ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారమంతా కేజ్రీ నివాసంలోనే జరిగినట్టు ఈడీ పేర్కొనడం ఆశ్చర్యానికి గురి చేసింది.

Updated Date - 2023-02-11T09:46:02+05:30 IST