Union Budget 2023: పన్ను చెల్లింపుదారులు మురిసేనా?.. కోరికలు ఇవే
ABN , First Publish Date - 2023-01-30T22:02:03+05:30 IST
కేంద్ర బడ్జెట్ (Union Budget2023) వస్తోందంటే ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు. బడుగు జీవుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు విభిన్న వర్గాల జనాలు గంపెడాశలు పెట్టుకుంటారు.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (Union Budget2023) వస్తోందంటే ఎన్నో ఆశలు.. మరెన్నో అంచనాలు. బడుగు జీవుల నుంచి పన్ను చెల్లింపుదారుల వరకు విభిన్న వర్గాల జనాలు గంపెడాశలు పెట్టుకుంటారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా బడ్జెట్ 2023పై (Budget2023) ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలు 2024కు ముందు (Assembly Elections) చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఆశలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా గత రెండు బడ్జెట్‌లలో ఊరించే ప్రకటనలేవీ లేకపోవడంతో ఈసారి బడ్జెట్‌లో పన్ను మినహాయింపుల (Tax exemptions) కోసం చెల్లింపుదారులు (Taxpayers) ఆతృతుగా ఎదురుచూస్తున్నారు. కొండెక్కిన ధరలు (Inflation) ఒకపక్క.. పెరిగిపోయిన జీవన ప్రమాణాలు మరోపక్క జేబులను ఖాళీ చేస్తున్న తరుణంలో చేతిలో మరింత డబ్బు మిగిలేలా ఉపశమన చర్యలు ప్రకటించాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. మరి చెల్లింపుదార్లు బడ్జెట్ నుంచి ఆశిస్తున్న ప్రధానాంశాలు ఏవో ఒకసారి పరిశీలిద్దాం...
ద్రవ్యోల్బణం ప్రభావం తీవ్రమైన నేపథ్యంలో చేతిలో డబ్బు కాస్త మిగిలే విధంగా వేర్వేరు మార్గాల్లో పన్ను మినహాయింపులు (Tax Exemptions) ఇవ్వాలని చెల్లింపుదార్లు కోరుతున్నారు. తద్వారా వ్యయాలకు ఊతమివ్వాలని ఆశిస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితం 2020-21లో ఐచ్ఛిక పన్ను విధానాన్ని (Optional tax regime) కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నూతన విధానం ద్వారా తక్కువ పన్ను రేటును ఎంచుకునే అవకాశం ఉన్నా.. మినహాయింపులేమీ దక్కడం లేదు. ఈ కారణంగానే ఆర్థిక, కుటుంబపరమైన బాధ్యతలు కలిగివున్న చెల్లింపుదార్లు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడానికి ఆసక్తిచూపడం లేదు. మినహాయింపుల కోసం పాత విధానానికే మొగ్గుచూపుతున్నారు. ఈ కేటగిరి చెల్లింపుదారులంతా కొత్త విధానంలో ప్రొవిడెండ్ ఫండ్, ఇన్సూరెన్స్ పేమెంట్స్, అద్దె(rent), హోమ్ లోన్ ఈఎంఐ (Home Loan EMI), పిల్లల ట్యూషన్ ఫీజు వంటి సాధారణ మినహాయింపులు కోరుతున్నారు.
సెక్షన్ 80సీ పరిమితి పెంచాలి..
సెక్షన్ 80సీ పరిమితిని 2014లో రూ.1.5 లక్షలకు పెంచారు. పాత పన్ను విధానం కింద పన్ను చెల్లింపుదార్లు పొందుతున్న ప్రయోజనం ఇది. అయితే ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో ఈ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచాలని చెల్లింపుదార్లు కోరుకుంటున్నారు. తద్వారా జనాల చేతుల్లో మరింత ఎక్కువ ఆదాయం మిగులుతుందని ఆశిస్తున్నారు.
పాత పన్ను విధానంలోని 20 శాతం, 30 శాతం పన్ను స్లాబుల పెంపు..
బడ్జెట్ 2023లో ట్యాక్స్ స్లాబుల పరిమితి పెంపు విషయాన్ని కేంద్రప్రభుత్వం పరిశీలించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాత పన్ను విధానంలోని అధిక ట్యాక్స్ స్లాబుల (Tax slabs) రేట్ల ప్రస్తుత పరిమితి పెంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా 20 శాతం రేటు లిమిట్‌ను ప్రస్తుత రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని పన్ను ట్యాక్స్‌పేయర్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో వేచిచూడాలి.
గృహ రుణ పరిమితి పెంపు..
ద్రవ్యోల్బణం కట్టడి కోసం మే 2022 నుంచి డిసెంబర్ 2022 మధ్య ఆర్బీఐ రెపో రేటును ఏకంగా 225 బేసిస్ పాయింట్ల మేర పెంచడంతో గృహ రుణాలు ఖరీదైనవిగా మారిపోయాయి. వడ్డీ రేట్లు పెరగడమే కాకుండా హోమ్ లోన్స్ డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ఆర్బీఐ డేటా ప్రకారం.. మార్చి నుంచి అక్టోబర్ మధ్య హోమ్ లోన్స్ 8.4 శాతం మేర వృద్ధి చెందాయి. అంతక్రితం ఆరు నెలలకంటే ఇది ఎక్కువగానే ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని గృహ కొనుగోలుదారులకు పన్ను తాయిలాలు ప్రకటిస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గృహ రుణ గ్రహీతలపై ఈఎంఐల భారం పడకుండా చూడాలని ఆశిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. హోమ్ లోన్ మినహాయింపులను సెక్షన్ 80సీ నుంచి తొలగించాలని పన్ను చెల్లింపుదార్లు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు హెల్త్‌కేర్ వ్యయాలు పెరిగిపోయాయి. తత్ఫలితంగా ప్రీమియం రేట్లు కూడా పెరిగిపోయాయి. అధిక ద్రవ్యోల్బణం పరిస్థితుల మధ్య ఆర్థిక భారాలు పెరిగిపోయిన నేపథ్యంలో 80డీ ట్యాక్స్ మినహాయింపు ప్రయోజనం పరిమితి పెంచాలనే డిమాండ్ కూడా చెల్లింపుదారుల నుంచి వినపడుతోంది. మరోవైపు హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని తగ్గించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ రేటు ప్రస్తుతం 18 శాతంగా ఉంది. జనాలపై భారాన్ని తగ్గించేందుకు జీఎస్టీ రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఉన్నాయి.