Crime: 12 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేసిన దంపతులు.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-09-02T17:38:46+05:30 IST

ఇంటి పనులు చేసే 12 ఏళ్ల బాలికను దారుణంగా హింసించారు ఓ దంపతులు. చదివిస్తామని బాలికను తమ వెంట తీసుకెళ్లిన దంపతులు ఇంట్లో పనికి పెట్టుకుని చిత్రహింసలకు గురి చేశారు.

Crime: 12 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేసిన దంపతులు.. అసలు ఏం జరిగిందంటే..?

ముంబై: ఇంటి పనులు చేసే 12 ఏళ్ల బాలికను దారుణంగా హింసించారు ఓ దంపతులు. చదివిస్తామని బాలికను తమ వెంట తీసుకెళ్లిన దంపతులు ఇంట్లో పనికి పెట్టుకుని చిత్రహింసలకు గురి చేశారు. సిగరెట్(cigarette), కాల్చిన అట్లకాడ(hot pan), వేడి చేసిన కత్తితో(hot knife) బాలిక శరీరంపై వాతలు పెట్టారు. అది సరిపోనట్లు బాలికను ఇంట్లో పెట్టి తాళం వేసి ఊరెళ్లిపోయారు. మనసును కలిచి వేసే ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో( Nagpur) జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగ్‌పూర్‌లోని అథర్వ నగరి హౌసింగ్ సొసైటీలో నివసించే దంపతులు మూడు సంవత్సరాల క్రితం ఇంటి పనుల కోసం ఓ బాలికను తెచ్చారు. బెంగళూరు(Bengaluru) నుంచి తెచ్చిన సమయంలో ఆ బాలిక వయసు 9 సంవత్సరాలు మాత్రమే. బాలికను బాగా చూసుకుంటామని, చదివిస్తామని ఆమె తల్లిదండ్రులకు హామీ ఇచ్చి మరి తీసుకొచ్చారు. కానీ ఆ దంపతులు ఆచరణలో మాత్రం అది చేయలేదు. బాలికతో ఇంటి పనులు చేయించడమే కాకుండా చిత్రహింసలకు గురి చేశారు.


తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేస్తే దారుణంగా హింసించారు. సిగరెట్, కాల్చిన కత్తి, కాల్చిన అట్లకాడతో బాలికపై వీపుపై వాతలు పెట్టారు. గాయాలకు తట్టుకోలేక ఆ చిన్ని ప్రాణం విలవిలలాడిన సదరు దంపతులు కనికరం చూపలేదు. బాలికను అలాగే చిత్రహింసలకు గురి చేశారు. దీంతో బాలిక శరీరంపై తీవ్రమైన కాలిన గాయాలయ్యాయి. అయితే ఆ దంపతులు ఇటీవల బెంగళూరుకు వెళ్లారు. ఆ సమయంలో బాలికను ఇంట్లోనే ఉంచి తాళం వేశారు. దీంతో బాలిక నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఒంటరిగా ఉండిపోయింది. అయితే కరెంట్ కూడా పోవడంతో ఆ బాలిక భయంతో కిటికీ నుంచి కేకలు వేసింది. ఇది గమనించిన చుట్టుపక్కలవారు ఇంటి డోర్‌ను బద్దలు కొట్టి బాలికన రక్షించారు. అనంతరం బాలికను ఓ ఎన్జీవో సంస్థకు అప్పగించారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలను చూసి నివ్వెరపోయిన ఎన్జీవో సంస్థ సిబ్బంది ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. దీంతో ఎన్జీవో(NGO) సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా చిత్రహింసలకు గురి చేసినట్టు నిర్దారణ అయిందని పోలీస్ అధికారి విక్రాంత్ సంగనే తెలిపారు. బెంగళూరు వెళ్లిన నిందితులను స్థానిక పోలీసులు అక్కడే అరెస్ట్ చేశారు. అనంతరం నాగ్‌పూర్ పోలీసులకు అప్పగించారు. దంపతులిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-09-02T22:33:26+05:30 IST