Crime: మూత్ర విసర్జన కోసమని క్యాబ్ ఆపిన కస్టమర్లు.. ఆ తర్వాత వారు చేసిన పనికి నిండా మునిగిన డ్రైవర్.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , First Publish Date - 2023-08-17T15:51:26+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని(uttar pradesh) నోయిడా నుంచి మథురకు(Noida to Mathura) వెళ్లాలని ఇద్దరు వ్యక్తులు క్యాబ్(CAB) బుక్ చేసుకున్నారు. డ్రైవర్ వాళ్లను గమ్యస్థానానికి చేర్చాక తిరిగి మళ్లీ నోయిడాకు చేర్చమన్నారు.

Crime: మూత్ర విసర్జన కోసమని క్యాబ్ ఆపిన కస్టమర్లు.. ఆ తర్వాత వారు చేసిన పనికి నిండా మునిగిన డ్రైవర్.. అసలు ఏం జరిగిందంటే..?

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని(uttar pradesh) నోయిడా నుంచి మథురకు(Noida to Mathura) వెళ్లాలని ఇద్దరు వ్యక్తులు క్యాబ్(CAB) బుక్ చేసుకున్నారు. డ్రైవర్ వాళ్లను గమ్యస్థానానికి చేర్చాక తిరిగి మళ్లీ నోయిడాకు చేర్చమన్నారు. అందుకు డ్రైవర్ కూడా అంగీకరించాడు. కానీ అందులో ఓ మాష్టర్ ప్లాన్ ఉందనే విషయాన్ని ఆ క్యాబ్ డ్రైవర్(CAB driver) గుర్తించలేకపోయాడు. దారి మధ్యలో మూత్ర విసర్జన కోసమని కారు ఆపించిన కస్టమర్లు తమ అసలు రంగను బయటపెట్టారు. వారు చేసిన పనికి పాపం ఆ డ్రైవర్ నిండా మునిగాడు. దీంతో న్యాయం కోసం ఆ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. అసలు ఏం జరిగిందంటే.. ఘజియాబాద్‌కు(Ghaziabad) దగ్గరలోని విజయ్‌నగర్‌ ప్రాంతంలో తరుణ్ సింగ్(25), చంద్రప్రకాష్ సింగ్(33)(Tarun Singh, Chandra Prakash Singh) అనే ఇద్దరు వ్యక్తులు డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా( delivery executives) పని చేసేవారు.


అయితే కొంత కాలం క్రితం వారి ఉద్యోగాలు పోయాయి. దీంతో అవసరాలను తీర్చుకునేందుకు డబ్బుల సమస్య ఏర్పడింది. దీంతో డబ్బు కోసం ఓ క్యాబ్, క్యాబ్ డ్రైవర్‌ను దోచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నోయిడా నుంచి మధురకు ఆగష్టు 13న క్యాబ్ చేసుకున్నారు. నిందితులు నోయిడాలో గల బిస్రఖ్ ప్రాంతంలోని ఇతేదా గోల్ చక్కర్‌లో క్యాబ్ ఎక్కారు. ఘజియాబాద్-రిజిస్టర్డ్ నంబర్ గల క్యాబ్‌లో నిందితులు బుక్ చేసుకున్న దాని ప్రకారం డ్రైవర్ వారిని మధురకు తీసుకెళ్లాడు. గమ్య స్థానానికి చేర్చాక తన చార్జి చెల్లించమని కస్టమర్లిద్దరినీ డ్రైవర్ అడిగాడు. కానీ వారు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. తమను తిరిగి నోయిడాకు చేర్చి డబ్బులు తీసుకోవాలని చెప్పారు. డ్రైవరు కూడా అందుకు అంగీకరించాడు. ఆగష్టు 13న రాత్రి 9:30 గంటల సమయంలో మథుర నుంచి నోయిడాకు తిరిగి పయనమయ్యారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే పారి చౌక్ సమీపానికి చేరుకున్నాక మూత్ర విసర్జన కోసమని కస్టమర్లు తరుణ్ సింగ్, చంద్రప్రకాష్ సింగ్ కారు ఆపమని డ్రైవర్‌కు చెప్పారు. దీంతో డ్రైవర్ కారు(car) ఆపాడు.

కారు ఆపాక తరుణ్ సింగ్, చంద్రప్రకాష్ సింగ్ తమ వెంట తెచ్చుకున్న కత్తి, తుపాకీని చూపించి డ్రైవర్‌ను బెదిరించారు. అతడి వద్ద ఉన్న డబ్బు, మొబైల్ ఫోన్ (Mobile phone), స్మార్ట్ వాచ్‌(Smart Watch), మరికొన్ని విలువైన వస్తువులను లాక్కున్నారు. అంతటితో ఆగకుండా సదరు డ్రైవర్ బ్యాంకు అకౌంట్(Bank account) నుంచి తమ సహచరుడి అకౌంట్‌కు రూ.14,239 బదిలీ చేయించుకున్నారు. అనంతరం కారు, దోచుకున్న వాటితో అక్కడి నుంచి పారిపోయారు. మొత్తంగా కస్టమర్లు చేసిన పనికి క్యాబ్ డ్రైవర్ నిండా మునిగాడు. దీంతో సదరు డ్రైవర్ తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి దోచుకున్న కారు, వస్తువులు, రూ.2,500 రికవరీ చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా నిందితులిద్దరు పట్టుబడినప్పుడు కూడా ఇదే తరహాలో మరో దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-08-17T15:51:26+05:30 IST