Government Schools: ఆ పాఠశాలలు కనుమరుగు? సీఎం ప్రయోగాలతో చిన్నారులు దూరం!
ABN , First Publish Date - 2023-02-20T15:18:52+05:30 IST
ఒక బడిలో ఒక టీచరు.. ముగ్గురు పిల్లలు. మరో బడిలో ఒక టీచరు.. ఐదుగురు పిల్లలు. ఒకటో తరగతిలో ఇద్దరుంటే రెండో తరగతిలో ముగ్గురు. వారిలో ఒక్కొక్కరు సెలవు పెడితే ఆ రోజుకు తరగతి గదిలో మిగిలేది ఒక్కరే. అసలు
విలీనం.. విద్యా విపత్తు!
పది మందీ లేని స్థితిలో ప్రైమరీ స్కూళ్లు
సీఎం జగన్ ప్రయోగాలతో స్కూళ్లకు చిన్నారులు దూరం
ఇష్టానుసారంగా 3, 4, 5 తరగతుల తరలింపు
1, 2 తరగతులతో బడులు వెలవెల.. వీటి విలీనం దిశగా కసరత్తు
దీంతో మొత్తానికే ఆ పాఠశాలలు కనుమరుగు?
ఒక బడిలో ఒక టీచరు.. ముగ్గురు పిల్లలు. మరో బడిలో ఒక టీచరు.. ఐదుగురు పిల్లలు. ఒకటో తరగతిలో ఇద్దరుంటే రెండో తరగతిలో ముగ్గురు. వారిలో ఒక్కొక్కరు సెలవు పెడితే ఆ రోజుకు తరగతి గదిలో మిగిలేది ఒక్కరే. అసలు టీచరే సెలవు పెడితే ఇక ఆ రోజు మొత్తంగా సెలవే! ఇదీ.. రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలల పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం (YCP Government) తీసుకున్న ‘విలీనం’ నిర్ణయం ప్రాథమిక విద్యను మిథ్యగా మార్చేసింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (Government Primary Schools) ఇప్పుడు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. ‘‘ఎవరైనా పిల్లలుంటే మా బడిలో చేర్పించండి’’ అని టీచర్లు బతిమలాడే పరిస్థితికి ప్రాథమిక విద్య దిగజారింది. ప్రైవేటు పాఠశాలల ప్రభావంతో ఇప్పటికే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అంతంత మాత్రంగా మారితే.. తరగతుల విలీనం పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయోగాలు ఏకంగా బడులే కనుమరుగయ్యే పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో అకస్మాత్తుగా చేసిన తరగతుల విలీన ప్రక్రియ ప్రాథమిక పాఠశాలలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో వేల సంఖ్యలో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. తాజా అంచనాల ప్రకారం ప్రకాశం జిల్లాలో 111 పాఠశాలలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 87, నెల్లూరులో 249, ఏలూరులో 84, అనంతపురంలో 128, అన్నమయ్యలో 157, శ్రీసత్యసాయిలో 192, చిత్తూరులో 205, విశాఖపట్నంలో 20, అనకాపల్లిలో 151, కడపలో 177, పార్వతీపురం మన్యంలో 95, పశ్చిమగోదావరిలో 75, కృష్ణాలో 125 పాఠశాలల్లో పది మంది కూడా విద్యార్థులు లేరు. ఇక, ఇవే పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు 20నుంచి 30 మంది విద్యార్థులు ఉండేవారు.
ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభించే సమయంలో కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోకి సమీప ప్రాథమిక స్కూళ్లలోని 3, 4, 5తరగతులను విలీనం చేసింది. ఇలా4,250 పాఠశాలల్లో తరగతులను విలీనం చేసింది. అప్పటివరకూ తరగతికి ఐదుగురు అనుకున్నా కనీసం 25 మంది విద్యార్థులుంటే.. విలీనం తర్వాత కేవలం రెండే తరగతులు మిగలడంతో పది కన్నా తక్కువకు విద్యార్థుల సంఖ్య పడిపోయుంది. ఫలితంగా అప్పటివరకూ ఇద్దరు టీచర్లుంటే ఒక టీచర్‌ను ఇతర పాఠశాలలకు పంపి ఒక్కరితోనే బడిని నడిపే పరిస్థితి తీసుకొచ్చారు.
ఉన్నత పాఠశాలల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నా చాలాకాలంగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఏమాత్రం ఆర్థిక స్థోమత ఉన్నా తల్లిదండ్రులు ప్రైవేటు బడికే పిల్లలను పంపుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో టీసీలు తీసుకున్న తల్లిదండ్రులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వెళ్లకుండా ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్పించారు. మరోవైపు కేవలం ఒక్క టీచరుతో తమ పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారనే సందేహంతో తల్లిదండ్రులు 1, 2 తరగతుల పిల్లలనూ ప్రైవేటు స్కూళ్లలో చేర్పించారు. దీం తో ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 3లక్షలకుపైగా విద్యార్థుల సంఖ్య పెరిగిందని ఒక అంచనా.
మళ్లీ విలీనమేనా?
ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ పది మంది లోపు విద్యార్థులున్న స్కూళ్ల వివరాలు సేకరించడం మొదలుపెట్టింది. కనీస సంఖ్యలో పిల్లలు లేనప్పుడు అక్కడ టీచర్ సహా నిర్వహణ ఖర్చులు వృథా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు తరగతుల విలీనమే చేయగా ఇప్పుడిక బడులే విలీనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ఒక కిలోమీటరు పరిధిని ఇంకా పెంచి అత్యల్ప స్థాయిలో పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలను పూర్తిగా మూసివేస్తారనే వాదన వినిపిస్తోంది.
నాడు-నేడు వృథా!
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ‘నాడు-నేడు’ పథకానికి ఖర్చు చేసిన ప్రభుత్వం.. విచిత్రంగా బడులు బాగుచేసిన తర్వాత తరగతులను విలీనం చేసింది. తొలి దశ నాడు-నేడులో 15వేలకు పైగా బడుల్లో అభివృద్ధి పనులు చేశారు. తీరా ఆ పనులు ముగిశాక వందలాది పాఠశాలల్లో విలీనం పేరుతో తరగతులను తరలించారు. దీంతో ఆ నిధులన్నీ వృథాయేనని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.
డీఎస్సీ లేకుండా ప్లాన్!
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 25వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేయాలని డిమాండ్ చేసిన ప్రస్తుత సీఎం జగన్ (CM JAGAN) అధికారంలోకి వచ్చాక డీఎస్సీ (DSC) గురించి మర్చిపోయారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం ఖాళీలను భర్తీచేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ కాకపోయినా సాధారణ స్థాయిలోనైనా టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు. పైగా తరగతుల విలీనం, రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులను కుదించే ప్రయత్నం చేస్తున్నారు.
హామీ మరిచారా జగన్?: విద్యా పరిరక్షణ కమిటీ
రాష్ట్ర ప్రభుత్వం (AP Government) గత నాలుగేళ్లుగా పాఠశాల విద్యను విధ్వంసం చేస్తోందని ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేశ్ పట్నాయక్ ఆరోపించారు. ఇప్పటికే 3, 4, 5 తరగతులను తరలించడం ద్వారా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ పది మందిలోపు విద్యార్థులున్న బడులను కూడా విలీనం చేసే ప్రక్రియ మొదలుపెట్టారన్నారు. ఒక్క బడిని కూడా మూసివేసే ప్రసక్తే లేదని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు పాఠశాలలను ముక్కలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.