AP: ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై అసంతృప్తి!

ABN , First Publish Date - 2023-03-10T13:13:38+05:30 IST

రాష్ట్రం (Andhra Pradesh)లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై అసంతృప్తి రాజుకుంటోంది. కొందరు అధికారులు ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ సాధారణ

AP: ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై అసంతృప్తి!
అసంతృప్తి!

కోర్సుల ప్రవేశాల్లో సమన్వయ లోపం..

మే నెలలోనే ఏపీఈఏపీసెట్‌ నిర్వహణ

ఉన్నత విద్యామండలి షెడ్యూలు విడుదల

దీనిపై డిగ్రీ కాలేజీల్లో అసంతృప్తి

ఇలాగైతే అందరూ ఇంజనీరింగ్‌కే

ఇక డిగ్రీ కోర్సులకు మిగిలేదెవరు?

అడ్మిషన్ల బాద్యతలు మాకే ఇవ్వండి

కళాశాల విద్యాశాఖలో డిమాండ్లు

ఇంజనీరింగ్‌తో సమాంతరంగా డిగ్రీ అడ్మిషన్లు

మేలోనే ప్రారంభించాలని సీఎస్‌కు లెక్చరర్ల వినతి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Andhra Pradesh)లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలపై అసంతృప్తి రాజుకుంటోంది. కొందరు అధికారులు ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యం ఇస్తూ సాధారణ డిగ్రీ కోర్సుల (degree courses)ను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యామండలి ఇంజనీరింగ్‌ వైపు మొగ్గు చూపుతుండగా, డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు తగ్గకుండా కళాశాల విద్యాశాఖ తంటాలు పడుతోందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ అడ్మిషన్ల బాధ్యతను ఉన్నత విద్యామండలి నుంచి తప్పించి కళాశాల విద్యాశాఖకు అప్పగించాలని ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కాలేజీల లెక్చరర్లు నేరుగా చీఫ్‌ సెక్రటరీని కలసి విన్నవించారు. ఇంజనీరింగ్‌ (Engineering)తో సమాంతరంగా డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించాలని కోరారు. దీనిపై పరిశీలించాలని సీఎస్‌ (CS) కూడా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈలోపే వచ్చే విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూలు విడుదల చేసింది. మే నెలలోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం డిగ్రీ కాలేజీ యాజమానాల్లో మరింత ఆందోళన పెంచుతోంది. మొత్తంగా అటు ఉన్నత విద్యామండలి, ఇటు కళాశాల విద్యాశాఖ మధ్య అడ్మిషన్ల విషయంలో సమన్వయం లోపించిందని అర్థమవుతోంది. అంతిమంగా ఈ పరిస్థితి ఇంజనీరింగ్‌ వర్సెస్‌ డిగ్రీ కోర్సులుగా మారుతోంది.

కన్వీనర్‌ను మార్చాలి

ఈ వ్యవహారంలో డిగ్రీ అడ్మిషన్ల కన్వీనర్‌ను మార్చేయాలనే డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. 2019-20 వరకు కాలేజీలు సొంతగా అడ్మిషన్లు చేసుకునేవి. 2020-21 నుంచి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విధానం ప్రవేశపెట్టి ఉన్నత విద్యామండలి ద్వారా ఇంజనీరింగ్‌ తరహాలో ప్రవేశాలు చేపడుతున్నారు. అదే సమయంలో కొవిడ్‌ కారణంగా ఈ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు కొంత ముందుగా జరుగుతున్నాయి. డిగ్రీ అడ్మిషన్లలో జాప్యంతో వీలైనంత వరకు విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరిపోతున్నారు. ఇది డిగ్రీ కాలేజీలపై ప్రభావం చూపిస్తోంది. దీంతో కళాశాల విద్య కమిషనర్‌ను డిగ్రీ అడ్మిషన్లకు కన్వీనర్‌గా చేస్తే కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య మెరుగుపడే అవకాశం ఉందని డిగ్రీ కాలేజీలు, కళాశాల విద్యాశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డిగ్రీ అడ్మిషన్లను ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యం చేస్తోందని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందన్న అభిప్రాయం కళాశాల విద్యాశాఖలో వినిపిస్తోంది.

భిన్నస్వరాలు

ఈ విషయంలో రెండు శాఖల అధికారుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత తగ్గితే విద్యామండలి చేసేదేముందని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎంపీసీ విద్యార్థులు మాత్రమే ఇంజనీరింగ్‌కు వెళ్తారని, మిగిలినవారు ఎలాగూ డిగ్రీలోనే ఉంటారని అభిప్రాయపడుతున్నారు. అయితే ముందే అడ్మిషన్లు చేపడితే ఎంపీసీ విద్యార్థుల్లోనూ కొందరు డిగ్రీలో చేరతారని కళాశాల విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. గతేడాది ఇంజనీరింగ్‌లో సుమారు 15వేల అడ్మిషన్లు పెరిగాయి. డిగ్రీ ప్రవేశాలు ఆలస్యం కావడం వల్ల కొందరు పక్క రాష్ర్టాలకు వెళ్లిపోయారు. సుమారు 22వేల మంది ఇంటర్‌ తర్వాత ఏ ఉన్నత విద్య కోర్సులో చేరకుండా మిగిలిపోయారు. సకాలంలో అడ్మిషన్లు చేపడితే ఈ స్థాయిలో డ్రాపౌట్లు ఉండరని డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.

డిగ్రీ కాలేజీలు వెలవెల

ఈ విద్యా సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు దారుణంగా పడిపోవడం ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలను షాక్‌కు గురిచేసింది. గతేడాది వరకూ విద్యార్థులతో కళకళలాడిన కాలేజీలు... ఈ ఏడాది మొదటి సంవత్సరంలో విద్యార్థుల్లేక ఖాళీ తరగతి గదులతో వెలవెలబోతున్నాయి. డిగ్రీలో ఏకంగా 1.2 లక్షల అడ్మిషన్లు తగ్గిపోవడంతో కాలేజీలను ఎలా నడపాలని ప్రైవేటు యాజమాన్యాలు తలలు పట్టుకున్నాయి. 166 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 58వేల సీట్లు ఉంటే ఈ విద్యా సంవత్సరంలో 26 వేలు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తంగా 3.46లక్షల సీట్లకు గాను కేవలం 1.4లక్షల మందే చేరారు. ఇంటర్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోవడమే ఇందుకు కారణమని ఉన్నత విద్యామండలి చెబుతోంది. అయితే సకాలంలో అడ్మిషన్లు చేపట్టి ఉంటే అడ్మిషన్లు మరీ ఇంత దారుణంగా పడిపోయేవి కావని డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ప్రవేశాల ప్రక్రియను జనవరి వరకూ సాగదీయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నాయి. వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇంజనీరింగ్‌తో పాటే డిగ్రీ అడ్మిషన్లు చేపట్టాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

Updated Date - 2023-03-10T13:13:38+05:30 IST