Telangana: విద్యార్థుల ఆశలపై నీళ్లు.. ఎంతకాలం ఎదురుచూపులు!

ABN , First Publish Date - 2023-02-18T12:26:37+05:30 IST

కొందరు విద్యార్థినులు చదువులకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. గత ఏడాది

 Telangana: విద్యార్థుల ఆశలపై నీళ్లు.. ఎంతకాలం ఎదురుచూపులు!
ఎంతకాలం ఎదురుచూపులు!

నాలుగేళ్లుగా ఫీజు బకాయిలు రూ.3,050కోట్లు..

స్కాలర్‌షిప్‌లతో కలిపితే రూ.4,592కోట్లు

కళాశాలలకు ఏడాది క్రితమే టోకెన్లు జారీ

ఇప్పటికీ నిధులు విడుదల చేయని సర్కార్‌

14లక్షల మంది విద్యార్థులకు తప్పని తిప్పలు

హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fees Reimbursement) పై ఆశలు పెట్టుకొని ప్రైవేట్‌ కాలేజీ (Private colleges)ల్లో చేరుతున్న విద్యార్థులకు చుక్కెదరవుతోంది. ప్రభుత్వం సకాలం (Kcr government) లో నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు వారిని ముప్పతిప్పలు పెడుతున్నాయి. మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు (Certificates) ఇస్తామని తేల్చిచెబుతున్నాయి. ఈ క్రమంలో ఫీజులు కట్టలేక కొందరు అర్ధంతరంగా చదువు మానేస్తుంటే.. మరికొందరు అప్పులు చేసి ఎలాగోలా కట్టేస్తున్నారు. బడ్జెట్‌ (Budget)లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులకు, విడుదల చేస్తున్న నిధులకు పొంతన ఉండడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలు కలిపి నాలుగేళ్లుగా మొత్తం రూ.4,592కోట్లకు పైగా బకాయిలు ఉండడం గమనార్హం. సంవత్సరాల వారీగా చూస్తే 2019-20లో రూ.270కోట్లు, 2020-21లో రూ.300కోట్లు, 2021-22లో రూ.1,872కోట్లు, 2022-23లో రూ.2,150 కోట్ల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలే రూ.3,050కోట్ల వరకూ ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం తాజా బడ్జెట్‌ (2023-24 బడ్జెట్‌)లో రూ.2,877కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంటే.. పెండింగ్‌ బకాయిలకు కూడా ఈ నిధులు సరిపోయే పరిస్థితి లేదు.

అసలు కేటాయించిన నిధుల్లో ఎన్ని విడుదల చేస్తారన్నది ఒక సందేహమైతే, వచ్చే ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు ఎలా సర్దుబాటు చేస్తారన్నది మరో సందేహం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ (Scholarship)లను మూడు నెలలకు ఒకసారి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీని ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభంలో 25 శాతం, మధ్యలో 50 శాతం, చివర్లో మరో 25 శాతం చెల్లిస్తామని పేర్కొంది. కానీ ఈ విధానాన్ని పాటించడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ఆయా కళాశాలలకు ప్రభుత్వం ఏడాది క్రితం నిర్దేశిత మొత్తాలతో టోకెన్లను జారీ చేసింది. కానీ, ఇంతవరకూ ఆ నిధులనూ విడుదల చేయలేదు. ఫలితంగా, రాష్ట్రంలో దాదాపు 14లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో తాము కళాశాలలు నిర్వహించలేకపోతున్నామని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచే ఫీజులను వసూలు చేసుకుంటున్నాయి. ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లను ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. దీంతో కొందరు విద్యార్థినులు చదువులకు మధ్యలోనే స్వస్తి చెబుతున్నారు. గత ఏడాది వనపర్తి జిల్లాలో ‘కల్యాణ లక్ష్మి’ (Kalyana Lakshmi) దరఖాస్తుల వెరిఫికేషన్‌ సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఇక, ఇదే జిల్లాలో 2020లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో ఆందోళనకు గురైన ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇది కూడా చదవండి: Viral Video: బైక్‌పై ఈ కోతులు ఎంత బుద్ధిగా కూర్చున్నాయో.. డ్రైవింగ్ చేసిన కుర్రాడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!

ఫీజులను పెంచని సర్కార్‌

ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రతి మూడేళ్లకొకసారి వృత్తి విద్యా కోర్సులతోపాటు ఇతర కోర్సులకు ఫీజులను పెంచుతోంది. ఉదాహరణకు బీటెక్‌ కోర్సులకు గతంలో రూ.38వేలుగా ఉన్న ఫీజు ప్రస్తుతం రూ.70వేలకు చేరింది. అయితే, సర్కారు మాత్రం ఆ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్ధులకు అందించే ఉపకార వేతనాలను పెంచడం లేదు. మేడ్చల్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రమేష్‌ అనే విద్యార్థికి కాలేజీ ఫీజు రూ.37,700 ఉండగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.20వేలే అందుతోంది. దీంతో మిగతా రూ.17,700లను ఆ విద్యార్థే చెల్లించాల్సి వస్తోంది. వీటితోపాటు ల్యాబ్‌, ఇతర సౌకర్యాల పేరిట కళాశాల యాజమాన్యం మరో రూ.5వేలను అదనంగా అడుగుతోందని.. సదరు విద్యార్థి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ మంజూరైనట్టు సందేశం వచ్చినా.. అకౌంట్‌లో జమకాలేదని వాపోయారు. కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల కోసం కేంద్రం అందిస్తోన్న 60శాతం స్కాలర్‌షిప్‌ నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందన్న ఆరోపణలున్నాయి. దీంతో 2021-22నుంచి ఆ నిధులను సైతం కేంద్రం నిలిపివేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకూ స్కాలర్‌షిప్‌లు అందడం లేదు.

school.jpg

ఇది కూడా చదవండి: Car Smoke: కారులోంచి వచ్చే పొగ నీలి రంగులోకి మారితే అర్థమేంటి..? తెలుపు, నలుపు రంగుల్లో కనిపిస్తే..

Updated Date - 2023-02-18T12:26:38+05:30 IST