Pakistan : పాకిస్థాన్ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ
ABN , First Publish Date - 2023-05-11T18:59:57+05:30 IST
పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఆ దేశ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టు చెల్లదని
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఆ దేశ సైన్యానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టు చెల్లదని అత్యున్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. ఆయనను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. దేశంలో అల్లర్లను తక్షణమే ఆపాలని పీటీఐ కార్యకర్తలను కోరాలని ఆయనకు చెప్పింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే పీటీఐ నేతలు కోర్టు బయట సన్నివేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
అంతకుముందు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) అధికారులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను అనుమతి లేకుండా న్యాయస్థానం ఆవరణలో అరెస్ట్ చేసినందుకు మండిపడింది. ఆయనను గురువారం సాయంత్రం 4.30 గంటలలోగా (ఒక గంటలోగా) న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించింది. కోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం కోర్టుధిక్కారమేనని తెలిపింది.
ఇదిలావుండగా, ఇమ్రాన్ ఖాన్‌ను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, ఆయన ఎక్కడా కనిపించడం లేదని పీటీఐ నేతలు ఆరోపించారు. ఆయనను కోర్టులో హాజరుపరచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అటా బండియాల్ ఆదేశించిన తర్వాత 1 గంట 30 నిమిషాలు గడుస్తున్నప్పటికీ ఆయన ఎక్కడా కనిపించడం లేదని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని దేశం కోరుకుంటోందని చెప్పారు.
అయితే కాస్త ఆలస్యంగా ఇమ్రాన్ ఖాన్‌ను సుప్రీంకోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు పీటీఐ నేతలు అలి మహమ్మద్ ఖాన్, ఎజాజ్ చౌదరిలను అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి :
Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట
Delhi : సుప్రీంకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ హర్షం.. అధికారులకు హెచ్చరిక..