ప్రియుడి కోసం చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దులు దాటిన మరో ప్రియురాలు.. 3 ఘటనల్లోనూ ఆడవాళ్లదే ‘కీ’ రోల్!

ABN , First Publish Date - 2023-07-27T20:02:48+05:30 IST

చైనాకు చెందిన ఓ యువతి స్నాప్‌చాట్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. 3 నెలల వీసా తీసుకుని మరి సదరు యువతి పాక్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మూడు ఘటనల్లోనూ మహిళలే దేశ సరిహద్దులు దాటారు. అలాగే మూడు ఘటనల్లోనూ వయసుల పరంగా ప్రియుడి కంటే ప్రియురాళ్లే పెద్ద వారు.

ప్రియుడి కోసం చైనా నుంచి పాకిస్థాన్‌కు.. సరిహద్దులు దాటిన మరో ప్రియురాలు.. 3 ఘటనల్లోనూ ఆడవాళ్లదే ‘కీ’ రోల్!

ఇటీవల ప్రేమికులు దేశ సరిహద్దులను దాటుతున్నారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి రిస్క్ చేసి మరి కట్టుదిట్టమైన భద్రతను అధిగమించి దేశం దాటిపోతున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం రాజస్థాన్‌కు చెందిన 34 ఏళ్ల వివాహిత అంజు పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మతం మార్చుకుని ఇస్లాంలో చేరి ప్రియుడు 29 ఏళ్ల నస్రాల్లాను వివాహం చేసుకుంది. అప్పటికే పెళ్లి అయిన అంజుకు భర్త, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరో ఘటనలో 30 ఏళ్ల సీమా హైదర్ అనే పాకిస్థాన్ మహిళ పబ్జీలో పరిచయమైన ప్రియుడి కోసం భారత్‌కు వచ్చింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలున్న సీమా.. వారిని తీసుకుని 22 ఏళ్ల సచిన్ కోసం భారత్‌లో అడుగుపెట్టింది. ఈ విచిత్ర ప్రేమ కథలను మరిచిపోకముందే అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఓ యువతి స్నాప్‌చాట్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. 3 నెలల వీసా తీసుకుని మరి సదరు యువతి పాక్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ మూడు ఘటనల్లోనూ మహిళలే దేశ సరిహద్దులు దాటారు. అలాగే మూడు ఘటనల్లోనూ వయసుల పరంగా ప్రియుడి కంటే ప్రియురాళ్లే పెద్ద వారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన 21 ఏళ్ల గావో ఫెంగ్‌‌కు స్నాప్‌చాట్‌లో 18 ఏళ్ల జావేద్ పరిచయం అయ్యాడు. ఇక్కడ ప్రియుడి కన్నా ప్రియురాలే 3 ఏళ్లు పెద్దది కావడం గమనార్హం. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. దీంతో ప్రియుడిని కలుసుకోవడం కోసం గావో ఫెంగ్ పాకిస్థాన్ వెళ్లాలని నిశ్చయించుకుంది. ఇందుకుగాను 3 నెలల సమయానికి విజిట్ వీసా కూడా తీసుకుంది. చైనా నుంచి పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని గిల్గిట్ మీదుగా రోడ్డు మార్గంలో బుధవారం ఇస్లామాబాద్ చేరుకుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని బజౌర్ గిరిజన జిల్లా నివాసి అయిన ఫెంగ్ ప్రియుడు జావేద్ ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. బజౌర్ జిల్లాలో భద్రతా కారణాల దృష్యా జావేద్ తన స్వగ్రామానికి బదులుగా లోయర్ దిర్ జిల్లాలోని సమర్‌బాగ్ తహసీల్‌లో ఉన్న తన మామ ఇంటికి మహిళను తీసుకెళ్లాడు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

లోయర్ దిర్ జిల్లా పోలీసు అధికారి జియావుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. చైనా మహిళకు సమర్‌బాగ్ ప్రాంతంలో పూర్తి భద్రత కల్పించామని తెలిపారు. మొహర్రం, భద్రతాపరమైన సమస్యల కారణంగా ఆమెకు స్వేచ్ఛగా తిరిగే అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. అయితే గావో ఫెంగ్‌ ప్రయాణ పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. మూడేళ్లుగా ఇద్దరికీ పరిచయం ఉందని, అయితే వారిద్దరూ ఇంకా నిఖా చేసుకోలేదని పోలీస్ అధికారి స్పష్టం చేశారు. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో ప్రేమికులు దేశ సరిహద్దులు దాటుతుండడం ఆశ్చర్యాన్ని కల్గిస్తుందనే చెప్పుకోవాలి.

Updated Date - 2023-07-27T20:02:48+05:30 IST