2024 Lok Sabha Elections : ఎన్డీయే వర్సెస్ ప్రతిపక్ష కూటమి.. ఎవరి బలం ఎంత?..
ABN , First Publish Date - 2023-07-18T12:51:01+05:30 IST
లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలతో సమాలోచనలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు ఈ ప్రయత్నాలను గత నెల నుంచి ముమ్మరం చేయగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తాజాగా రంగంలోకి దిగింది. జాతీయవాదాన్ని వినిపించే బీజేపీని దీటుగా ఎదుర్కొనడం కోసం ప్రతిపక్షాలు తమ కూటమికి ‘దేశభక్తి’ని జోడించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలతో సమాలోచనలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు ఈ ప్రయత్నాలను గత నెల నుంచి ముమ్మరం చేయగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తాజాగా రంగంలోకి దిగింది. జాతీయవాదాన్ని వినిపించే బీజేపీని దీటుగా ఎదుర్కొనడం కోసం ప్రతిపక్షాలు తమ కూటమికి ‘దేశభక్తి’ని జోడించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమకు 38 పార్టీల మద్దతు ఉందని ఎన్డీయే చెప్తుండగా, 26 పార్టీల మద్దతుతో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయేను గద్దె దించుతామని కాంగ్రెస్ తదితర పార్టీలు చెప్తున్నాయి.
ఎన్డీయే బలాబలాలు
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు దక్షిణ భారత దేశంలో బలం లేకపోయినప్పటికీ, కొన్ని పార్టీలను తమ కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేనతో పొత్తును కొనసాగిస్తోంది. మంగళవారం ఢిల్లీలో నిర్వహించే మిత్ర పక్షాల సమావేశంలో 38 పార్టీలు పాల్గొనబోతున్నట్లు ప్రకటించింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్డీయే పరిధి పెరుగుతోందని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనపట్ల ప్రజల్లో సానుకూల ప్రభావం కనిపిస్తుండటంతో తమ కూటమిలోని పక్షాలన్నీ చాలా సంతోషంగా ఉన్నాయని తెలిపారు.
ఇదిలావుండగా, ఎన్డీయే నుంచి గతంలో బయటకు వెళ్లిన శిరోమణి అకాలీ దళ్ తిరిగి ఈ కూటమిలో చేరే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం న్యూఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశంలో పాల్గొనే అవకాశంగల పార్టీలు.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, అప్నా దళ్, ఏజీపీ, రాష్ట్రీయ లోక్‌జన శక్తి పార్టీ, నిషాద్ పార్టీ, యూపీపీపీఎల్, ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్, ధడియాల్), జనసేన, ఎన్‌సీపీ (అజిత్ పవార్ వర్గం), లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్), హెచ్ఏఎం, ఆర్ఎల్ఎస్పీ, వీఐపీ, ఎస్‌బీఎస్ఏపీ. ఎన్డీయే తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు.
దక్షిణాదిలో పట్టు సాధించడం కోసం ఏఐఏడీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ (థామస్), భారత ధర్మ జన సేన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీతో పొత్తు గురించి ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీతో జత కలిస్తే తెదేపాకు నష్టం జరుగుతుందనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్తుండటంతో బీజేపీ, టీడీపీ, జనసేన ఏ విధంగా వ్యవహరిస్తాయనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. కర్ణాటకలో జేడీఎస్ ప్రస్తుతానికి తటస్థంగా కనిపిస్తోంది. అయితే రానున్న కాలంలో ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. మహారాష్ట్రలో ఎన్‌సీపీ చీలిపోయి, అజిత్ పవార్ నేతృత్వంలో బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరడంతో ఆ రాష్ట్రంలో ఎన్డీయే విజయావకాశాలు మెరుగుపడినట్లు చెప్పవచ్చు. బిహార్‌లో ఆర్జేడీ, జేడీయూ బలంగా కనిపిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇటీవల ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల నేతలు ప్రశంసల్లో ముంచెత్తడాన్ని బీజేపీ రానున్న ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేసుకోవచ్చు. ఆయన బలమైన నాయకుడని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష కూటమి కప్పల తక్కెడలా ఉందని ప్రచారం చేయవచ్చు. యూపీఏ హయాంలోని పదేళ్ల పాలనలో అవినీతి విశృంఖలంగా జరిగిందనే ఆరోపణలు ఎటూ ఉండనే ఉన్నాయి. దేశంలో కోవిడ్-19 మహమ్మారి, డిజిటల్ విప్లవం, రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోళ్లు వంటివాటిని కూడా చూపిస్తూ మోదీ బలమైన నాయకుడని, ఆయన తన సత్తాను చాటుకున్నారని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది.
ప్రతిపక్ష కూటమి బలాబలాలు
భావ సారూప్యతగల 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో మంగళవారం సమావేశమవుతున్నాయి. వీటిలో కాంగ్రెస్ అతి పెద్ద ప్రాంతీయ పార్టీ మాదిరిగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ కాస్త ఊపు మీద ఉంది. అదే ఊపులో తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కూడా గెలవగలమనే ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది.
రాజకీయ విశ్లేషకుల కథనం ప్రకారం, ఈ 26 పార్టీల సిద్ధాంతాల్లో వైరుద్ధ్యం చాలా ఉంది. రాష్ట్రాల్లో పోరాడుకునే పార్టీలు జాతీయ స్థాయిలో మాత్రం కలిసికట్టుగా ఉంటామని చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీలలో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పోరాడుతోంది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వామపక్షాలతో కాంగ్రెస్ యుద్ధం చేస్తోంది.
బీజేపీతో ఏకైక ప్రతిపక్ష అభ్యర్థి పోటీ చేసేలా చేద్దామని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెప్పిన సూత్రాన్ని కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణమ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కాంగ్రెస్ ముక్త భారత్‌ను మరింత సులువు చేస్తుందని మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీలను కలిపి ఉంచుతున్న ఏకైక సూత్రం ‘కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులు’. తమను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి, తమను బెదిరిస్తోందని ఈ పార్టీల నేతలు ప్రజల ముందుకు వెళ్తున్నారు.
దేశానికి స్వాతంత్యం సిద్దించి వందేళ్లు పూర్తయ్యేనాటికి, అంటే రానున్న పాతికేళ్లలో దేశాన్ని ప్రపంచంలో అభివృద్ధిచెందిన దేశంగా తీర్చిదిద్దుతానని మోదీ చెప్తున్నారు. ప్రతిపక్షాలకు ఎటువంటి సైద్ధాంతిక సారూప్యత కనిపించడం లేదు. ఓ వ్యక్తిని పదవీచ్యుతుడిని చేయాలనే ఏకైక లక్ష్యం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మోదీని ప్రతిపక్ష కూటమి ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. మరోవైపు బలమైన నేతలు నాయకత్వం వహిస్తున్న పార్టీలే నిట్టనిలువునా చీలిపోతున్న కాలంలో ఏ పార్టీ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కూడా కష్టమే.