New Parliament Row : ప్రతిపక్షాలకు 270 మంది ప్రముఖుల ఘాటు లేఖ

ABN , First Publish Date - 2023-05-26T19:36:13+05:30 IST

నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలపై దేశంలోని 270 మంది ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Parliament Row : ప్రతిపక్షాలకు 270 మంది ప్రముఖుల ఘాటు లేఖ
New Parliament

న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాలను బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్షాలపై దేశంలోని 270 మంది ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నవారు తాము ప్రజాస్వామ్యపు ఆత్మను ఏ విధంగా పీల్చి, పిప్పి చేస్తున్నదీ అర్థం చేసుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. అప్రజాస్వామిక పడికట్టు పదాలతో, ఓ దినచర్య మాదిరిగా, నిరాధారమైన బహిష్కరణలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించిన పార్టీ రహిత కార్యక్రమాల జాబితాను చూస్తే కళ్లు చెదురుతాయని పేర్కొన్నారు.

దాదాపు 270 మంది ప్రముఖులు ప్రతిపక్షాలను ఉద్దేశించి శుక్రవారం ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖపై సంతకాలు చేసినవారిలో మాజీ ఉన్నతాధికారులు, మాజీ సైనికాధికారులు, విద్యావంతులు ఉన్నారు. మాజీ ఎన్ఐఏ డైరెక్టర్ యోగేశ్ చందర్ మోదీ, మాజీ డీజీపీలు ఎస్‌పీ వైద్, బీఎల్ వోహ్రా, విక్రమ్ సింగ్, మాజీ రాయబారులు భాస్వతి ముఖర్జీ, నిరంజన్ దేశాయ్, వీరేందర్ గుప్తా, జేఎస్ సప్రా, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గోపాల కృష్ణ, దీపక్ సింఘాల్, సీఎస్ ఖైర్వాల్ తదితరులు ఈ లేఖను విడుదల చేశారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం యావత్తు దేశానికి గర్వకారణమని తెలిపారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు గతంలో బహిష్కరించిన నాలుగు కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అవసరం లేకుండానే, ఊహాజనిత అన్యాయం పట్ల నిరసన తెలియజేయాలని నిర్ణయించుకుందని, ఇది భారత దేశ ప్రజాస్వామ్యంలో అత్యంత తీవ్ర నిరాశ కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ స్వభావం ఎల్లప్పుడూ అప్రజాస్వామికంగానే ఉందన్నారు. ఆ పార్టీ నేతల మితిమీరిన గర్వం దేశ ప్రగతి బాటలో ఎల్లప్పుడూ అడ్డంకిగా ఎదురొస్తోందని దుయ్యబట్టారు. తాము అర్థం చేసుకోలేనిదాన్ని భారతీయులు అర్థం చేసుకోగలరనే విషయాన్ని కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు తెలుసుకోలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు ఎంత లోతుగా ఆలోచించినా, కోల్పోయినది ప్రజాస్వామ్యపు ఆత్మ కాదని, ప్రతిపక్షాలు ప్రజాదరణను కోల్పోయాయని అర్థం చేసుకోగలుగుతాయా? అని ప్రశ్నించారు.

ప్లకార్డులు పట్టుకోవడం, బిగ్గరగా నినాదాలు చేయడం, దేశంలోని అత్యంత ప్రధాన వ్యవస్థలను అగౌరవపరచడం, పాల ప్యాకెట్లు వంటి గృహ వినియోగ వస్తువులను కూడా నిరసనల కోసం ఉపయోగించడం వంటి పద్ధతులను అనుసరించడం అధికార తత్వవాదమని ప్రతిపక్షాలు అర్థం చేసుకోలేకపోతున్నాయన్నారు. ఇలాంటి పద్ధతులను అనుసరించడం మన ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానించడమేనని, నేరుగా దాడి చేయడమేనని స్పష్టం చేశారు.

నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించబోతున్నారు. తెదేపా, వైకాపా, బీజేడీ, ఎస్ఏడీ తదితర పార్టీలతో సహా అధికార కూటమి పక్షాలు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, కాంగ్రెస్ సహా దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) చేత ప్రారంభింపజేయకపోవడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి

New Parliament Building : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

Updated Date - 2023-05-26T19:36:13+05:30 IST