I.N.D.I.A : 28 పార్టీల ఇండియా కూటమి భేటీ ప్రారంభం.. ఖర్గే, రాహుల్, నితీశ్, కేజ్రీవాల్ సహా 63 మంది హాజరు..

ABN , First Publish Date - 2023-08-31T21:11:04+05:30 IST

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమి సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతున్న ఈ సమావేశాల తొలి రోజు 28 పార్టీలకు చెందిన 63 మంది హాజరయ్యారు.

I.N.D.I.A : 28 పార్టీల ఇండియా కూటమి భేటీ ప్రారంభం.. ఖర్గే, రాహుల్, నితీశ్, కేజ్రీవాల్ సహా 63 మంది హాజరు..

ముంబై : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా (I.N.D.I.A) కూటమి సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో జరుగుతున్న ఈ సమావేశాల తొలి రోజు 28 పార్టీలకు చెందిన 63 మంది హాజరయ్యారు. వీరంతా బీజేపీని ఎదుర్కొనడం కోసం వ్యూహాన్ని రచిస్తారు. అదేవిధంగా కూటమి లోగో, సమన్వయకర్తల కమిటీ నియామకం వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయని తెలుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, బిహార్ మంత్రి సంజయ్ కుమార్ ఝా, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ థాకరే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మోదీపై రాహుల్ ఆగ్రహం

రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, అదానీ గ్రూప్ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘం చేత సవివరమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ సమస్యను లేవనెత్తినపుడు మోదీ అసౌకర్యంగా, ఆందోళనగా కనిపిస్తారని ఆరోపించారు.

పీఎం అభ్యర్థిపై ..

మీడియా ప్రశ్నలకు ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ప్రధాన మంత్రి అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించవలసిన అవసరం లేదన్నారు. ఎన్నికలు జరగాలని, తమకు మెజారిటీ రావాలని, ఆ తర్వాత దీని గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇండియా కూటమికి కన్వీనర్ ఉండాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఇటువంటి సమావేశాలను నిర్వహించలేం కాబట్టి వర్కింగ్ గ్రూప్ అవసరమని తెలిపారు. వర్కింగ్ గ్రూప్ సమావేశాలు తరచూ జరిగితే, కచ్చితంగా సమర్థవంతంగా ఉంటుందన్నారు.

అందరి మద్దతు

మహారాష్ట్ర కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్ మాట్లాడుతూ, ఇండియా కూటమి పట్ల దేశం దృక్పథం మారుతోందన్నారు. అందరూ ఈ కూటమికి మద్దతిస్తున్నారని చెప్పారు.


ఇవి కూడా చదవండి :

Adani Group : తాజా ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్.. అవన్నీ పాత పాటలేనన్న పారిశ్రామిక దిగ్గజం..

Parliament : కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం

Updated Date - 2023-08-31T21:11:04+05:30 IST