Heavy Rains: భారీ వర్షాలకు ఒక్కరోజే ఏడుగురు మృతి.. సీఎం సంతాపం.. మొత్తంగా 257 మంది ప్రాణాలు గల్లంతు

ABN , First Publish Date - 2023-08-14T11:43:09+05:30 IST

హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Heavy Rains: భారీ వర్షాలకు ఒక్కరోజే ఏడుగురు మృతి.. సీఎం సంతాపం.. మొత్తంగా 257 మంది ప్రాణాలు గల్లంతు

హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఏకంగా 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే రూ.7 వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది. సోలన్ జిల్లాలోని జాదోన్ గ్రామంలో ఆదివారం కురిసిన కుంభవృష్టిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కందఘాట్ సబ్‌డివిజన్‌లోని మామ్లిగ్ గ్రామంలో వర్షాల్లో చిక్కుకున్న ఆరుగురిని రక్షించారు. మామ్లిగ్ గ్రామంలో ఆదివారం కురిసిన వర్షానికి రెండు ఇళ్లు, ఒక గోవు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కాగా మృతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే భారీ వర్షాల నేపథ్యంలో కొండప్రాంతంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేయనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన నష్ట తీవ్రతపై అన్న జిల్లాల కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. భారీ వర్షాల దృష్ట్యా పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శితో పాటు అన్ని డీసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోడ్లు, విద్యుత్, నీటి ఏర్పాట్లను సజావుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సూచించారు.


కాగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల రోడ్డు మార్గాలను మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఆగస్టు 14న జరగాల్సిన బీఎడ్ పరీక్షతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షలను రద్దు చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాతావరణ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం రానున్న రోజుల్లో రాష్ట్రంలోని చంబా, కాంగ్రా, హమీర్‌పూర్, మండి, బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది. బియాస్, రంజిత్ సాగర్, పాంగ్ డ్యాం పరివాహక ప్రాంతాలలో అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో కొండచరియలు విరిగిపడటం వల్ల దేశంలోనే అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్ ఉంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7020.28 కోట్ల నష్టం వాటిలినట్లు అధికారులు ప్రకటించారు.

కాగా హిమాచల్‌ప్రదేశ్‌లోకి రుతుపవనాలు జూన్ 24న ప్రవేశించాయి. జూన్ 24 నుంచి కురిసిన వర్షాల కారణంగా ఇప్పటివరకు 257 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. "257 మందిలో 66 మంది కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర కారణాల వల్ల 191 మంది ప్రాణాలు కోల్పోయారు. 32 మంది గల్లంతయ్యారు. 290 మంది గాయపడ్డారు" అని అధికారులు తెలిపారు. కాగా వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 1,376 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మరో 7,935 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Updated Date - 2023-08-14T11:43:09+05:30 IST