Michaung: ఆసుపత్రుల్లోకి వరద నీరు.. రాగల 3 గంటలు..
ABN , First Publish Date - 2023-12-05T10:33:14+05:30 IST
బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటివరకు కనీసం 8 మంది చనిపోయారు.
చెన్నై: బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో రాజధాని చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చెన్నైలో ఇప్పటివరకు కనీసం 8 మంది చనిపోయారు. మరోవైపు మరికాసేపట్లో మిచౌంగ్ తుఫాన్ తీరం దాటనుంది. భారీ వర్షపాతం కారణంగా చెన్నైలో రోడ్లు నదుల మాదిరిగా మారాయి. సోమవారం కురిసిన భారీ వర్షాలకు పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షాల కారణంగా విద్యాసంస్థలను కూడా మూసివేశారు. పరిస్థితులు మెరుగుపడే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ప్రైవేట్ కార్యాలయాలు తమ ఉద్యోగులను కోరారు. ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో చెట్లు, గోడలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది. ఫలితంగా ఆరోగ్య సంరక్షణ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడిది. అనేక రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. చైన్నై విమానాశ్రయం రన్వే జలమయం కావడంతో మంగళవారం ఉదయం 9 గంటల వరకు విమానాలు అందుబాటులో లేకుడా పోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో వర్షాల తీవ్రత కాస్త తగ్గినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం సోమవారం, మంగళవారం సెలవులు ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో చెన్నైలోని పెరుంగుడిలో 29 సెంటీమీటర్లు, తిరువళ్లూరు జిల్లా అవడిలో 28 సెంటీమీటర్లు, చెంగల్పేటలోని మామల్లపురంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కన్యాకుమారి జిల్లాల్లో రానున్న మూడు గంటలపాటు తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మిచౌంగ్ తుఫాను కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం తెలిపారు. పోలీసు, అగ్నిమాపక, రెస్క్యూ సహా వివిధ శాఖల సిబ్బందిని పెద్దఎత్తున మోహరిస్తున్నట్లు ఆయన చెప్పారు.