Heart attack: గుండె పోటుతో విద్యార్థి మృతి
ABN , Publish Date - Dec 25 , 2023 | 11:52 AM
జైపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి గుండె పోటుతో చనిపోయాడు. ఈ ఘటన ఖర్దానిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది.
జైపూర్: జైపూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి గుండె పోటుతో చనిపోయాడు. ఈ ఘటన ఖర్దానిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. చనిపోయిన విద్యార్థిని యోగేష్ సింగ్‌గా గుర్తించారు. డిసెంబర్ 19న ఉదయం 8:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రోజువారి మాదిరిగానే పాఠశాలకు వచ్చిన విద్యార్థి క్లాస్ రూంలోకి అడుగుపెట్టే సమయంలో తమ టీచర్‌పై కుప్పకూలి పడిపోయాడు. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. కర్ధాని పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారి మాదిరిగానే విద్యార్థి అన్నయ్య అతిడిని పాఠశాలలో దించాడు.
అతను తన తరగతి గదికి వెళ్తున్నాడు. అప్పటికే సగం మంది విద్యార్థులు వచ్చారు. మిగతా విద్యార్థులు వస్తున్నారు. తరగతి గది ముందు టీచర్ నిలబడి ఉన్నాడు. క్లాస్ రూం వద్దకు చేరుకున్న విద్యార్థి ఉపాధ్యాయుడి మీద పడిపోయాడు. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని రక్షించడానికి వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. విద్యార్థి మరణానికి గుండె పోటు కారణంగా వైద్యులు తేల్చారు. విషయం గురించి తెలియడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మృతిపై కుటుంబసభ్యులు ఇప్పటివరకు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.