Opposition meeting: వీళ్లేం సీఎంలు? ఇదేం సమావేశం?: రవిశంకర్ ప్రసాద్
ABN , First Publish Date - 2023-07-17T18:48:16+05:30 IST
బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశంపై బీజేపీ పెదవి విరిచింది. దీనిని అవకాశవాదులు, అధికార దాహం కలిగిన నేతల సమావేశంగా అభివర్ణించింది. ఇందువల్ల దేశానికి జరిగే మేలేమీ ఉండదని పేర్కొంది. విపక్షాల సమావేశానికి వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించింది.
న్యూఢిల్లీ: బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశంపై (Opposition meeting) భారతీయ జనతా పార్టీ (BJP) పెదవి విరిచింది. దీనిని అవకాశవాదులు, అధికార దాహం కలిగిన నేతల సమావేశంగా అభివర్ణించింది. ఇందువల్ల దేశానికి ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ జరిగే మేలేమీ ఉండదని పేర్కొంది. విపక్షాల సమావేశానికి వెళ్లిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించింది.
దేశ రాజధాని ఢిల్లీ వరదలతో విలవిల్లాడుతుంటే ప్రజలను ఆదుకునేందుకు బదులు విపక్ష పార్టీల సమావేశానికి వెళ్లడం ఏమిటని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. ''వరద సంక్షోభాన్ని ఆయన (కేజ్రీవాల్) గాలికి వదిలేశారు. ఆయనను ఎలాంటి సీఎం అనాలి? మమతాబెనర్జీ (టీఎంసీ చీఫ్) ఇలాకాలో ప్రజలు దాడులు, హింస చవిచూశారు. దీనిపై కాంగ్రెస్, సీపీఎం పెదవి విప్పడం లేదు. ఇదొక స్వార్థపరుల కూటమి. ఢిల్లీ విషయంలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ మాట్లాడటం లేదు. ఇలాంటి ప్రజలు దేశానికి మంచి భవిష్యత్తు ఇవ్వగలరా? కచ్చితంగా ఇవ్వలేరు'' అని రవిశంకర్ ప్రసాద్ సోమవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
వరదలలో చిక్కుకున్న ఢిల్లీ ప్రజలను కాపాడేందుకు కేజ్రీ వాల్ చేసిందేమీ లేదని, కేంద్రాన్ని విమర్శించడానికే ఆయన పరిమితమయ్యారని, కాంగ్రెస్ అయితే అసలు వరదలపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బెంగాల్‌లో జరిగిన హింస గురించి అందరికీ తెలిసినా ఒక్కరూ మాట్లాడటం లేదని, ప్రధాన సమస్యలన్నింటినీ మరుగుపరచేందుకు విపక్షాలన్నీ బెంగళూరులో సమావేశమవుతున్నాయని ఆక్షేపించారు. కాగా, విపక్షాల ఐక్య కూటమి ఏర్పాటులో భాగంగా సోమ, మంగళవారంనాడు బెంగళూరులో జరిగే విపక్షాల సమావేశంలో 26కు పైగా పార్టీల నేతలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.