Delhi Liquor Scam: 9 గంటలకు పైగా కేజ్రీని ప్రశ్నిస్తోన్న సీబీఐ అధికారులు.. దిక్కుతోచని స్థితిలో ఆప్ శ్రేణులు
ABN , First Publish Date - 2023-04-16T20:25:40+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann ) ఢిల్లీ నివాసంలో ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam ) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal)కు సీబీఐ (Central Bureau of Investigation-CBI) సమన్లు జారీ చేసి సుదీర్ఘంగా విచారిస్తోన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann ) ఢిల్లీ నివాసంలో ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. మాన్‌తో పాటు గోపాల్ రాయ్, పంకజ్ గుప్తా ఇతర సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కేసులో కేజ్రీని అరెస్ట్ చేస్తే తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ఢిల్లీ సీఎం పదవి ఎవరు చేపట్టాలనే విషయంపై కూడా ఆప్ నేతలు చర్చించింనట్లు సమాచారం.
అంతకు ముందు కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను నిరసిస్తూ ధర్నా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాఘవ్ చద్దా (Raghav Chadha), సంజయ్ సింగ్ (Sanjay Singh)లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేసినవారిలో వీరితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిషి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన దాదాపు 1,500 మంది ఆప్ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీథుల్లో కూడా ఆప్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపేందుకు పంజాబ్ నుంచి వచ్చిన తమ పార్టీ నేతలు, మంత్రులను సింఘు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. డాక్టర్ బల్బీర్ సింగ్, బ్రమ్ శంకర్ జింప, హర్జోత్ సింగ్ బెయిన్స్, కుల్జిత్ రణధవా, ఎమ్మెల్యే దినేశ్ చద్దా తదితరులను ఢిల్లీ నగరంలోకి అడుగు పెట్టనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
వాస్తవానికి కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) ఈ ఉదయం 11.40 గంటలకు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI) కార్యాలయంలో హాజరయ్యారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొన్ని దేశ వ్యతిరేక శక్తులు భారత దేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. అయినప్పటికీ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఆ శక్తులకు తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ఆప్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, తదితర నేతలు ఉన్నారు. అనంతరం వీరంతా కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి, ప్రార్థనలు చేశారు.
సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు కేజ్రివాల్ విడుదల చేసిన వీడియోలో, సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని సష్టం చేశారు. తనను అరెస్టు చేస్తారంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అధికార మదంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘మా మాట వినాలి.. లేదంటే జైల్లో పెడతాం’ అనే తరహాలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తానని తెలిపారు. ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి అడుగులు వేశానన్నారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. తనను జైల్లో పెడతామంటూ పదేపదే బెదిరిస్తున్నారన్నారు.
కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు 9 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో పాత్ర గురించి, మద్యం వ్యాపారులు, సౌత్ లాబీ సభ్యులు ఈ విధానాన్ని రూపొందించేటపుడు ఎలాంటి ప్రభావం చూపించారని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులతో కూడిన సౌత్ లాబీతో జరిగిన చాట్స్‌పై కూడా ప్రశ్నించినట్లు సమాచారం.
9 గంటలకు పైగా కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. లోపల ఏం జరుగుతుందో తెలియక ఆప్ శ్రేణులు కంగారుపడుతున్నాయి. ముఖ్యనేతలు ఆప్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.