Delhi Pollution: మరోసారి కాలుష్య కోరల్లో ఢిల్లీ.. ఆ వాహనాలకు మాత్రమే అనుమతి!
ABN , First Publish Date - 2023-11-01T11:48:19+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకుని ఆసుపత్రులపాలవ్వడం ఢిల్లీ వాసులకు సాధారణమైపోయింది.
దేశ రాజధాని ఢిల్లీ మరోసారి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. కాలుష్యంతో కూడిన గాలిని పీల్చుకుని ఆసుపత్రులపాలవ్వడం ఢిల్లీ వాసులకు సాధారణమైపోయింది. కాగా కొన్ని సంవత్సరాలుగా తీవ్ర గాలి కాలుష్యంతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మరోసారి వాతావరణంలో కాలుష్యం పెరిగిపోవడంతో ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించింది. గాలి నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 300 దాటిపోయింది. బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 336కి చేరుకుంది. గాలి నాణ్యత క్షీణించడం వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలో ఉదయం 7 గంటల సమయంలో ఏక్యూఐ రీడింగ్ ఏకంగా 391 నమోదైంది. పూసాలో 311గా ఉంది. దీంతో గాలి నాణ్యత చాలా పేలవంగా ఉంది. ఉదయం 7 గంటలకు ఐఐటీ ఢిల్లీ ప్రాంతంలో 329, విమానాశ్రయం ప్రాంతంలో 339గా, మధుర రోడ్డు ప్రాంతంలో 362గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది. అయితే పెరిగిపోతున్ను గాలి కాలుష్యాన్ని అదుపులో పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలే చేసింది. కానీ ఆ ప్రయత్నాలన్నీ అప్పటివరకు తాత్కాలికంగా ఉపశమనం కల్గిస్తున్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత పరిస్థితి మళ్లీ యథా స్థితికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) నవంబర్ 1 నుంచి ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, బీఎస్ VI-కంప్లైంట్ డీజిల్ బస్సులను మాత్రమే ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని నగరాలు, పట్టణాల మధ్య నడపడానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించింది.