NDA : కొత్త పార్లమెంటులో ‘సెంగోల్’ ప్రతిష్ఠ.. తమిళులకు అమిత్ షా టార్గెట్..

ABN , First Publish Date - 2023-06-12T10:29:57+05:30 IST

అత్యంత ఘనమైన చోళ సామ్రాజ్య కాలంనాటి వారసత్వ సంపద అయిన ధర్మదండం ను నూతన పార్లమెంటులో ప్రతిష్ఠించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

NDA : కొత్త పార్లమెంటులో ‘సెంగోల్’ ప్రతిష్ఠ.. తమిళులకు అమిత్ షా టార్గెట్..

చెన్నై : అత్యంత ఘనమైన చోళ సామ్రాజ్య కాలంనాటి వారసత్వ సంపద అయిన ధర్మదండం (సెంగోల్)ను నూతన పార్లమెంటులో ప్రతిష్ఠించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ధన్యవాదాలు తెలపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తమిళులను కోరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి 25 మందికిపైగా ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడచిన తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు చెన్నైలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 300కుపైగా స్థానాలను గెలుచుకుని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో 25కుపైగా ఎంపీ స్థానాలను ఎన్డీయే గెలుచుకుంటుందని, రాష్ట్రం నుంచి ఎక్కువ మంది మంత్రులవుతారని చెప్పారు.

స్టాలిన్ ప్రశ్నలకు స్పందన

తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో ఏం చేసిందో చెప్పాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం డిమాండ్ చేసిన నేపథ్యంలో అమిత్ షా స్పందిస్తూ, తాను జవాబులు చెప్పడానికే ఇక్కడికి వచ్చానన్నారు. తాను చెప్పేదానిని స్టాలిన్ శ్రద్ధగా వినాలని, ధైర్యం ఉంటే స్పందించాలని అన్నారు. డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీయే ప్రభుత్వం తమిళనాడుకు పదేళ్లలో రూ.95 వేల కోట్ల డివల్యూషన్ ఫండ్‌ను విడుదల చేసిందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ.2.47 లక్షల కోట్ల డివల్యూషన్ ఫండ్‌ను విడుదల చేసిందని చెప్పారు. తొమ్మిదేళ్ల తమ పాలనలో తమిళనాడుకు రూ.58 వేల కోట్లను వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా తమ ప్రభుత్వం తమిళనాడుకు రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇచ్చిందన్నారు. చెన్నై విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్‌ను నిర్మించామన్నారు. రూ.1,000 కోట్లతో నైవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్‌ ఓ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. పేదల కోసం 62 లక్షల మరుగుదొడ్లను నిర్మించామన్నారు. జల జీవన్ మిషన్ క్రింద 82 లక్షల నీటి కొళాయి కనెక్షన్లను ఇచ్చినట్లు తెలిపారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్‌ కోసం కొత్త క్యాంపస్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణంలో జాప్యం జరుగుతుండటంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, డీఎంకే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాలంలో తమిళనాడుకు ఎయిమ్స్‌ను తీసుకురావడంలో ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. ఆలిండియా సర్వీసెస్, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలను తమిళంలో రాసేందుకు అవకాశం కల్పించినది తమ ప్రభుత్వమేనని చెప్పారు.

డీఎంకే, కాంగ్రెస్‌లపై విమర్శలు

డీఎంకే, కాంగ్రెస్‌ ‘‘టూజీ, త్రీజీ, ఫోర్‌జీ’’ పార్టీలని అమిత్ షా విమర్శించారు. టూజీ అంటే టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణం మాత్రమే కాదని, టూజీ (2G) అంటే రెండు తరాలు, త్రీజీ అంటే మూడు తరాలు (3G) అని చెప్పారు. డీఎంకే నేత మురసోలి మారన్ కుటుంబం రెండు తరాల నుంచి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబం మూడు తరాల నుంచి, గాంధీ కుటుంబం నాలుగు తరాల (4G) నుంచి అధికారం చలాయిస్తున్నట్లు తెలిపారు. వీరంతా అవినీతికి పాల్పడ్డారన్నారు.

ఇవి కూడా చదవండి :

Apsara Case : అప్సర హత్య తర్వాత సంచలన విషయాలు వెల్లడిస్తూ ఆమె అత్త ఆడియో విడుదల

Modi ji thali : మోదీ అమెరికా పర్యటన.. ‘మోదీజీ థాలీ’ని ప్రారంభించిన అమెరికన్ రెస్టారెంట్..

Updated Date - 2023-06-12T10:56:35+05:30 IST