BJP Vs Congress : రాజస్థాన్ కాంగ్రెస్ గ్రూపులపై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-04-15T20:18:05+05:30 IST
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అత్యంత చాకచక్యంగా స్పందించారు.
న్యూఢిల్లీ : రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అత్యంత చాకచక్యంగా స్పందించారు. గత బీజేపీ ప్రభుత్వ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. పైలట్ క్షేత్ర స్థాయిలో ఎంత కృషి చేసినా, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ఖజానా కోసం చేస్తున్న కృషికి విలువ ఎక్కువ అని అన్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బూత్ ప్రెసిడెంట్ సంకల్ప సమ్మేళనంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఈ నెల 11న నిరాహార దీక్ష చేశారు. వసుంధర రాజే సింథియా (Vasundhara Raje Scindia) నేతృత్వంలోని గత రాజస్థాన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, దానిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ జైపూర్‌లో ఈ దీక్ష చేశారు. పైలట్ ఓ బీజేపీ నేతతోనూ, స్వతంత్ర ఎంపీతోనూ సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ నేపథ్యంలో అమిత్ షా శనివారం మాట్లాడుతూ, సచిన్ పైలట్ ఏ సాకుతో ధర్నా చేసినా, ఆయన నంబర్ మాత్రం రాదన్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం అవినీతిమయమని విమర్శించారు. పైలట్ క్షేత్ర స్థాయిలో చేస్తున్న కృషి ఎంత గొప్పదైనప్పటికీ, కాంగ్రెస్ ఖజానాకు గెహ్లాట్ చేస్తున్న కృషి చాలా చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌ను పరిపాలించేందుకు ప్రజలు కాంగ్రెస్‌కు ఓ అవకాశం ఇచ్చారని, అయితే గెహ్లాట్, పైలట్ మధ్య అంతర్గత ఘర్షణ వల్ల ఈ ఏడాదిలో జరిగే శాసన సభ ఎన్నికల్లో వారి ఓటమికి దారి తీయవచ్చునని అన్నారు. అధికారం కోసం వీరిద్దరూ పోట్లాడుకుంటున్నారన్నారు. రాబోయే ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయబోతోందని, వీరిద్దరూ అనవసరంగా పోట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
రానున్న రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి మూడింట రెండొంతుల ఆధిక్యత లభిస్తుందనే విశ్వాసం తమకు ఉందన్నారు. అంతేకాకుండా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాలను కైవసం చేసుకుంటామన్నారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 3డీ ప్రభుత్వం ఉందన్నారు. ఆ మూడు ‘డీ’లను వివరిస్తూ, దంగే (అల్లర్లు), దుర్వ్యవహార్ (మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం), దళితులపై దుశ్చర్యల ప్రభుత్వం ఉందన్నారు.
2008 నాటి జైపూర్ వరుస పేలుళ్ళ కేసులో నిందితులంతా నిర్దోషులుగా విడుదలయ్యారని, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనమైన వాదనలను వినిపించడమేనని ఆరోపించారు. (2008లో జరిగిన ఈ పేలుళ్లలో 71 మంది ప్రాణాలు కోల్పోగా, 180 మందికిపైగా గాయపడ్డారు). కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.
ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతల మంతనాలు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా చర్చలు జరపాలని రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ సింగ్ రణధవా నిర్ణయించారు. ఈ సమావేశాలు వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవుతాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ కూడా చర్చల్లో పాల్గొంటారని తెలిపాయి.
ఇవి కూడా చదవండి :
Delhi Excise Policy: కోర్టుల ముందు అబద్దాలు చెబుతున్న దర్యాప్తు సంస్థలు.. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్
Kejriwal Vs Rijiju : కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి రిజిజు సూటి ప్రశ్న