Ballary: చంద్రబాబుకు మద్దతుగా హోరెత్తిన నిరసనలు
ABN , First Publish Date - 2023-09-26T11:07:14+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున
బళ్లారి, (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Former Chief Minister Nara Chandrababu Naidu) అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు సాగుతున్నాయి. ప్రజాస్వామ్య వాదులు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, తెలుగు సంఘాలు, కమ్మసంఘాలు, మహిళా సంఘాలు సోమవారం రాయచూరు(Raichur) జిల్లా మాన్వి పట్టణంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేపట్టారు. స్థానిక కాకతీయ పాఠశాల ఆవరణంలో సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లకు, రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాసి ఫ్యాక్సు ద్వారా పంపించారు. సుమారు మూడు గంటల పాటు ర్యాలీ సాగింది. వేలాది మంది వివిధ సంఘాల నాయకులు, ప్రజలు, మహిళలు హాజరయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ సైకో జగన్ వల్ల ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుందని, అలాంటి నాయకుడికి ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు.
మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్, మాజీ ఎమ్మెల్యే రాణా వెంకటప్ప నాయక్, గంగాధర నాయక్, బసవన్న గౌడ, కర్నూలు జిల్లా టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మ, ప్రముఖులు వెంకటసుబ్బారావు చౌదరి, శ్రీనివాస్, సురేష్, తదితరుల నేతృత్వంలో సుమారు 4వేల మందికి పైగా చేరి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే హంపయ్య నాయక్ మాట్లాడూతూ చంద్రబాబు దక్షత కలిగిన నాయకుడుని, అలాంటి నాయకుడిని జైల్లో పెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును విడుదల చేసే వరకూ ఉద్యమాలు ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా విజయనగర(హొస్పేట్)లో చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేశారు. వివిధ క్యాంపులు నుంచి తెలుగువాళ్లు, ప్రజాసంఘాలు, కమ్మసంఘాలు, స్థానిక ప్రజలు చేరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును వెంటనే ఎటువంటి కేసులూ లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.