Bajrang Dal Ban : హిందూ సంస్థలపై నిషేధాలు.. భావోద్వేగ రాజకీయాలు..

ABN , First Publish Date - 2023-05-06T11:59:48+05:30 IST

కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది.

Bajrang Dal Ban  : హిందూ సంస్థలపై నిషేధాలు.. భావోద్వేగ రాజకీయాలు..
Karnataka Polls

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)ను, బజరంగ్ దళ్‌ను ఒకే గాటన కట్టడంపై పెను దుమారం జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రత్యేకంగా ‘బజరంగ్ బలికి జై’ అని ప్రజల చేత అనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ సంస్థలపై గతంలో ఏయే ప్రభుత్వాలు ఏ విధంగా నిషేధం విధించాయో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు గట్టిగా చెప్తున్నాయి.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది?

కర్ణాటక శాసన సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోలో, బజరంగ్ దళ్, పీఎఫ్ఐ వంటి సంస్థలు శత్రుత్వాన్ని, విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని ఆరోపించింది. తమ పార్టీ అధికారం చేపడితే ఇటువంటి సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చింది. దీంతో బజరంగ్‌ దళ్, బీజేపీ తీవ్రంగా స్పందించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని మోదీ ‘జై బజరంగ్‌బలి’ అని నినదిస్తున్నారు. బీజేపీ, బజరంగ్‌దళ్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసాను పఠిస్తున్నారు.

సమాజ్‌వాదీ పార్టీ స్పందన

అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, విద్వేషాన్ని రెచ్చగొట్టే సంస్థలను నిషేధించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)ను సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గతంలో నిషేధించిన విషయాన్ని గుర్తు చేసింది.

ఆరెస్సెస్‌పై మూడుసార్లు నిషేధం

మహాత్మా గాంధీ హత్యానంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (RSS)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. 1948 ఫిబ్రవరి 4న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో ఆరెస్సెస్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపింది. విద్వేష శక్తులను సమూలంగా పెకలించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 18 నెలల తర్వాత ఈ నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హోం మంత్రిగా పని చేసిన కాలంలోనే ఈ నిషేధం విధించినప్పటికీ, ప్రస్తుతం సర్దార్ పటేల్‌ను బీజేపీ, ఆరెస్సెస్ గొప్పగా పొగుడుతున్న సంగతి తెలిసిందే. ఆరెస్సెస్‌పై 1975లో ఎమర్జెన్సీ కాలంలోనూ, 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన నేపథ్యంలోనూ నిషేధం విధించారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం 1992లో అప్పటి పీవీ నరసింహారావు నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బజరంగ్ దళ్‌పై కూడా నిషేధం విధించింది. ఓ ఏడాది తర్వాత ఈ నిషేధాన్ని ఎత్తివేశారు.

శ్రీరామ్ సేనపై గోవా బీజేపీ ప్రభుత్వం నిషేధం

2014 జూన్‌లో శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ మాట్లాడుతూ, తమ సంస్థ శాఖను గోవాలో సెప్టెంబరులో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సంస్థను గోవాలో నిషేధించాలని పర్యాటక రంగం, మహిళా సంఘాలు, విద్యావంతులు, కళాకారులు డిమాండ్ చేశారు. ఈ సంస్థ మంగళూరులోని పబ్‌లలో హింసాకాండకు పాల్పడిందని, అదే తరహా సంఘటనలు గోవాలో పునరావృతమవుతాయని వీరు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అదే ఏడాది ఆగస్టులో బీజేపీ నేతృత్వంలోని గోవా ప్రభుత్వం శ్రీరామ్ సేనను నిషేధించింది. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ శాసన సభలో మాట్లాడుతూ, శ్రీరామ్ సేనను గోవాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించామని చెప్పారు. ఈ సంస్థపై నివేదికను తయారు చేయాలని పోలీసులకు చెప్పామని, ఆ నివేదికను కలెక్టర్‌కు పంపించి, ఈ సంస్థ గోవాలో ప్రవేశించకుండా నిషేధించామని తెలిపారు.

కర్ణాటకలో ‘బజరంగ్ బలి’ రాజకీయం

కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్‌పై నిషేధం గురించి కనిపించిన వెంటనే బీజేపీ, బజరంగ్ దళ్ తదితర హిందూ సంస్థలు రంగంలోకి దిగాయి. కాంగ్రెస్‌ను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పఠనాలు నిర్వహించాయి. కాంగ్రెస్ హిందువులకు, హనుమంతుడికి వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేస్తున్నాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) బుధవారం కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి దూషించే సంస్కృతి ఉందని, దానిని శిక్షించేందుకు ఓటు వేసేటపుడు ‘జై బజరంగ్‌బలి’ అని చెప్పాలని కోరారు.

కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు

హిందువులను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను దీటుగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మాట్లాడుతూ, తమ పార్టీ అధికారం చేపడితే రాష్ట్రవ్యాప్తంగా ఆంజనేయ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ మాట్లాడుతూ, బజరద్‌దళ్‌ను నిషేధించే ప్రతిపాదన లేదన్నారు.

‘జై బజరంగ్ బలి’ గేమ్ ఛేంజర్?

ఈ ప్రచారాలను నిశితంగా పరిశీలిస్తున్న విశ్లేషకులు బజరంగ్ దళ్, బజరంగ్ బలి ప్రభావంపై అంచనాలు కడుతున్నారు. ఇప్పటి వరకు వస్తున్న ఒపీనియన్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయని, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వచ్చిన ఈ పరిణామాల వల్ల ఓటర్లు ఏవిధంగా స్పందిస్తారోనని తరచి తరచి చూస్తున్నారు. ఇది బీజేపీకి గేమ్ ఛేంజర్ అవుతుందా? కాంగ్రెస్ వైపు ముస్లింలు మరింత ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం వస్తుందా? అని పరిశీలిస్తున్నారు. బజరంగ్ దళ్‌ను, బజరంగ్ బలిని ఒకే విధంగా ప్రచారం చేస్తూ బీజేపీ లబ్ధి పొందగలుగుతుందా? హనుమంతుడి భక్తులను తనవైపు తిప్పుకోగలుగుతుందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఓటర్లు ఈ అంశానికి పెద్ద పీట వేసి, బీజేపీ పాలనలో ఎదురైన కష్టనష్టాలను మర్చిపోతారా? అనే విషయం మే 10న తేలుతుందని చెప్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ దృష్టి సారించకుండా బీజేపీ చేయగలిగిందని కూడా కొందరు చెప్తున్నారు. ఓటర్ల దృష్టిని హనుమంతుడివైపు మళ్లించగలిగిందని అంటున్నారు. మరోవైపు హిందువులను ఏకం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో, ముస్లింలంతా గంపగుత్తగా కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మరి కొందరు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Jada Shravan Kumar: ఆర్‌-5జోన్‌పై సుప్రీంలో రైతుల పిటిషన్.. ఇంప్లీడ్ కానున్న జడ శ్రవణ్

Two Encounters : రాజౌరి,బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లు...ఉగ్రవాది హతం

Updated Date - 2023-05-06T11:59:48+05:30 IST