Bengaluru Opposition meet : ప్రతిపక్షాల సమావేశం.. నితీశ్ కుమార్‌కు షాక్..
ABN , First Publish Date - 2023-07-18T10:26:24+05:30 IST
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)కు వ్యతిరేకంగా బెంగళూరు నగరంలో పోస్టర్లు వెలిశాయి.
బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)కు వ్యతిరేకంగా బెంగళూరు నగరంలో పోస్టర్లు వెలిశాయి. చాళుక్య సర్కిల్, విండ్సర్ మేనర్ బ్రిడ్జ్, విమానాశ్రయం రోడ్డులో వీటిని గుర్తించిన పోలీసులు వెంటనే తొలగించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్టర్ల పక్కనే నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిని ఎవరు ఏర్పాటు చేశారో స్పష్టంగా తెలియదు. ప్రధాన మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న అస్థిర అభ్యర్థి నితీశ్ కుమార్ అని ఓ పోస్టర్‌లో ఉంది. బిహార్‌లోని సుల్తాన్ గంజ్ బ్రిడ్జి నిర్మాణంలో ఉండగా రెండుసార్లు కూలిపోయిన విషయాన్ని దీనిలో గుర్తు చేశారు. కూలిపోతూ ఉండే వంతెన బిహార్‌కు నితీశ్ బహుమతి అని ఎద్దేవా చేశారు. ఆయన పాలనను వంతెనలు తట్టుకోలేకపోతున్నాయని, ప్రతిపక్షాల ఐక్యత కోసం ఆయన నాయకత్వంపై ఆధారపడుతున్నారని చురకలంటించారు. నితీశ్‌కు బెంగళూరు ఎర్ర తివాచీ పరచుతోందని, సుల్తాన్ గంజ్ వంతెన 2022 ఏప్రిల్‌లో మొదటిసారి కూలిపోయిందని, 2023 జూన్‌లో రెండోసారి కూలిపోయిందని మరో పోస్టర్లో వివరించారు. ఈ పోస్లర్లను ఆ మార్గంలో వెళ్లేవారు పరిశీలనగా చూడటం కనిపించింది. నితీశ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఈ పోస్టర్లను బెంగళూరు పోలీసులు తొలగించారు.
26 ప్రతిపక్ష పార్టీలు పాల్గొనే ఈ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు పునఃప్రారంభమవుతాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఉమ్మడి మీడియా సమావేశం జరుగుతుంది. ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రతిపక్షాల మొదటి రోజు సమావేశానికి హాజరుకాకపోవడంతో కొంత ఆసక్తి రేకెత్తింది. రెండో రోజు సమావేశంలో పాల్గొనేందుకు ఆయన తన కుమార్తె సుప్రియ సూలేతో కలిసి చార్టర్డ్ విమానంలో మంగళవారం ఉదయం ముంబై నుంచి బెంగళూరుకు బయల్దేరారు. దీంతో ఆయన హాజరుపై సస్పెన్స్‌కు తెర పడింది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, ప్రతిపక్షాల కూటమికి నాయకత్వ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించవచ్చునని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
CPM: బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే హిట్లర్ పాలనే