Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు

ABN , First Publish Date - 2023-07-18T15:16:45+05:30 IST

Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు

Bengaluru Opposition meet : ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు

బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరును ఖరారు చేశాయి. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా నిర్ణయించాయి. ఈ పేరుపై నేతలంతా సుముఖత, ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిని అధికారికంగా ప్రకటించవలసి ఉంది. ఈ పేరును వెల్లడిస్తూ ఆర్జేడీ ఇచ్చిన ట్వీట్‌ను కాసేపటికే డిలీట్ చేసింది.

I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా నూతన కూటమికి పేరు పెట్టారు. బెంగళూరులో సోమ, మంగళవారాల్లో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, ఆర్ఎల్‌డీ, అప్నాదళ్ (కే), నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, ఆర్ఎస్‌పీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండీఎంకే, వీసీకే, కేఎండీకే, ఎంఎంకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), కేరళ కాంగ్రెస్ (జోసఫ్) పార్టీలు పాల్గొన్నాయి.

ఇదిలావుండగా, మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రతిపక్ష పార్టీల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని చెప్పారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి మక్కువ ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావని, ప్రజలను కాపాడటం కోసం వాటిని పక్కన పెట్టవచ్చునని చెప్పారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం వాటిని వదిలిపెట్టవచ్చునని చెప్పారు.

స్వచ్ఛమైన అవినీతి కూటమి

ప్రతిపక్షాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తీవ్రంగా విరుచుకుపడ్డారు. బెంగళూరులో సమావేశమైన పార్టీలకు ఒకే ఒక మంత్రం ఉందని, అది.. కుటుంబం యొక్క, కుటుంబం ద్వారా, కుటుంబం కోసం అని వివరించారు. ఇది స్వచ్ఛమైన అవినీతి కూటమి అని ఆరోపించారు. అందుకే ప్రజలు 2024లో మళ్లీ ఎన్డీయేను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారన్నారు.

ఇవి కూడా చదవండి :

Bengaluru Opposition meet : విపక్షాల రెండో రోజు సమావేశం మరికాసేపట్లో ప్రారంభం.. శరద్ పవార్ హాజరుపై వీడిన సస్పెన్స్..

Bengaluru Opposition meet : ప్రతిపక్షాల సమావేశం.. నితీశ్ కుమార్‌కు షాక్..

Updated Date - 2023-07-18T15:24:57+05:30 IST