Pee Gate : కాంగ్రెస్‌లో నెం.2 నేత కూడా బహిరంగంగా ఆ పని చేశారు : బీజేపీ
ABN , First Publish Date - 2023-01-07T16:30:52+05:30 IST
ప్రయాణిస్తున్న విమానంలో ఓ మహిళపై సహ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేయడంపై పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో
న్యూఢిల్లీ : ప్రయాణిస్తున్న విమానంలో ఓ మహిళపై సహ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేయడంపై పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో బీజేపీ ఓ సంఘటనను గుర్తు చేసింది. కాంగ్రెస్‌లో అత్యధిక ప్రజాదరణగల నేతల్లో రెండో స్థానంలో ఉన్న కన్నయ్య కుమార్ (Kanhaiya Kumar) కూడా బహిరంగంగా ఆ పని చేశారని దుయ్యబట్టింది. 2015లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) ప్రాంగణంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది.
బీజేపీ (BJP) నేత అమిత్ మాలవీయ (Amit Malaviya) శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, మనం #PeeGate (అనుచితరీతిలో మూత్ర విసర్జన చేయడం) గురించి చర్చిస్తున్నామని, ఈ సందర్భంగా కన్నయ్య కుమార్ చేసిన పనిని మర్చిపోకూడదని తెలిపారు. కాంగ్రెస్‌లో అత్యధిక ప్రజాదరణగల నేతల్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) తర్వాత రెండో స్థానంలో కన్నయ్య కుమార్ ఉన్నారని గతంలో అదే పార్టీకి చెందిన సీనియర్ నేత జైరామ్ రమేశ్ (Jairam Ramesh) అన్నారని తెలిపారు. కాంగ్రెస్ (Congress) నెంబర్ 2 నేత కన్నయ్య కుమార్ 2015లో జేఎన్‌యూ ప్రాంగణంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేశారని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఆ విధంగా మూత్ర విసర్జన చేయవద్దని వారించిన వ్యక్తిని ఆయన బెదిరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల్లో అలాంటి ప్రతిభావంతులు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, అమిత్ మాలవీయ ప్రస్తావించిన ఈ సంఘటన 2015లో జరిగింది. అప్పట్లో కన్నయ్య కుమార్ విద్యార్థి సంఘం నేత కాదు. కన్నయ్య కుమార్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నట్లు జేఎన్‌యూ విద్యార్థిని ఒకరు గుర్తించారు. ఇదేం పని? అని ప్రశ్నించిన ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను వివరిస్తూ, తన పట్ల ఆయన తప్పుగా ప్రవర్తించారని, తనను బెదిరించారని ఆమె జేఎన్‌యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన నకిలీ విప్లవకారుడని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కేసులో కన్నయ్యకు జరిమానా విధించినట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఆయన ప్రాతినిధ్యంవహిస్తున్న ఏఐఎస్ఎఫ్ ఖండించింది. ఆయన కీర్తి ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది.