BJP : శాసన సభల ఎన్నికలకు బీజేపీ ముందస్తు సన్నాహాలు

ABN , First Publish Date - 2023-08-16T12:52:55+05:30 IST

ఐదు రాష్ట్రాల శాసన సభలకు త్వరలో జరిగే ఎన్నికలకు వ్యూహ రచనను బీజేపీ ముందస్తుగానే ప్రారంభించింది. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం సమావేశం కాబోతోంది.

BJP : శాసన సభల ఎన్నికలకు బీజేపీ ముందస్తు సన్నాహాలు
BJP

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసన సభలకు త్వరలో జరిగే ఎన్నికలకు వ్యూహ రచనను బీజేపీ ముందస్తుగానే ప్రారంభించింది. ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొంటారు.

బీజేపీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అంటే, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే అత్యున్నత స్థాయి వ్యవస్థ. ఎన్నికల వ్యూహాలను కూడా ఈ వ్యవస్థ ఖరారు చేస్తుంది. ఎన్నికల ప్రకటన వెలువడటానికి ముందు ఈ కమిటీ అరుదుగా సమావేశమవుతుంది. అయితే విజయావకాశాలకు ఢోకా లేకుండా చూసుకోవడం కోసం ఈ కమిటీ సమావేశం ముందుగానే జరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగలడంతో ఏ అవకాశాన్నీ వదలకుండా త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం కోసం పోరాడాలని బీజేపీ నిర్ణయించుకుంది.

తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ శాసన సభలకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో విజయం సాధించాలని బీజేపీ బలంగా కోరుకుంటోంది. ఈ రాష్ట్రాల్లోని ఏయే నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉందో గుర్తిస్తారని తెలుస్తోంది. ఈ స్థానాలకు అభ్యర్థులను ముందుగానే గుర్తించి, ఎన్నికలకు సమాయత్తమవడానికి తగిన సమయం ఇవ్వబోతున్నట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చే హామీల దాడిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది.


మిజోరాంలో అధికార పార్టీ ఎంఎన్ఎఫ్ ఇటీవల మోదీ ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించింది. దీనినిబట్టి బీజేపీతో ఎంఎన్ఎఫ్‌కు విభేదాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

మధ్య ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే కాంగ్రెస్‌తో ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.

ఈ ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్ సభ ఎన్నికలపై ఉంటుందనే నమ్మకం చాలా మందికి ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ప్రతిపక్ష కూటమి ఇండియా మధ్య పోటీని ఈ ఫలితాలు ప్రభావితం చేస్తాయని కొందరు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి :

Birthday wishes : కేజ్రీవాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన మోదీ

Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని ఏబీ వాజ్‌పాయి నాయకత్వంతో దేశానికి గొప్ప మేలు : మోదీ

Updated Date - 2023-08-16T12:52:55+05:30 IST