Maharashtra: అజిత్ పవార్‌కు బీజేపీ సుపారీ.. మాజీ హోం మంత్రి సంచలన ఆరోపణ
ABN , First Publish Date - 2023-12-01T15:42:48+05:30 IST
ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు, సీనియర్ నేత శరద్ పవార్ రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు అజిత్ పవార్‌కు బీజేపీ సుపారీ ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సంచలన ఆరోపణ చేశారు.
ముంబై: ఎన్‌సీపీ (NCP) వ్యవస్థాపకుడు, సీనియర్ నేత శరద్ పవార్ (Sharad Pawar) రాజకీయ జీవితాన్ని అంతం చేసేందుకు అజిత్ పవార్ (Ajit Pawar)కు బీజేపీ (BJP) సుపారీ (Contract) ఇచ్చిందని మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (Anil Deshmukh) సంచలన ఆరోపణ చేశారు. భోపాల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం అనంతరం అజిత్ పవార్, 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంలో చేరడం ప్రతి ఒక్కరికీ తెలుసునని శరద్ పవార్ వర్గం నేత దేశ్‌ముఖ్ అన్నారు.
''ఆయన (అజిత్ పవార్) వేరే మార్గం ఎందుకు ఎంచుకున్నారో మీకు తెలుసా? నాకు ఎదురైన అనుభవాన్ని ఎదుర్కొనేందుకు సీనియర్ ఎన్‌సీపీ నేతలకు ఇష్టం లేదు'' అని అవినీతి కేసులో తన అరెస్టును పరోక్షంగా ప్రస్తావిస్తూ దేశ్‌ముఖ్ చెప్పారు. ఎన్‌సీపీలో చీలకకు ముందు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఆయన గుర్తు చేస్తూ, రూ.70,000 కోట్ల అవినీతిలో ఎన్‌సీపీ ప్రమేయం ఉందని ప్రధాని ఆరోపించారని చెప్పారు. శరద్ పవార్ రాజకీయ జీవితాన్ని తుదముట్టించేందుకు అజిత్ పవార్‌కు బీజేపీ సుపారీ ఇచ్చిందని ఆరోపించారు. అజిత్ పవార్ మద్దతుదారులు ఆయనను సీఎంగా చూడాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు రాష్ట్రంలోని అధికార భాగస్వాములు ఏమనుకుంటున్నారో తనకు తెలియదన్నారు. అయితే, ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో అజిత్ పవార్‌ను బీజేపీ దూరంగా పెట్టిందని చెప్పారు. అజిత్ పవార్ గత జూలై 2 ఎన్‌సీపీలో తిరిగుబాటు బావుటా ఎగురవేసి, తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. వెంటనే ఆయన ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.