Uddhav Thackeray: బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారు.. మోదీపై థాక్రే చురకలు..!

ABN , First Publish Date - 2023-08-30T19:12:15+05:30 IST

విపక్ష ఇండియా కూటమి రెండ్రోజుల కీలక సమావేశం ముంబైలో ఈనెల 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ థాకరే ఘాటు విమర్శలు గుప్పించారు. బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారని, అయితే తాము అభివృద్ధితో పాటు స్వేచ్ఛ కూడా కోరుకుంటున్నామని పరోక్షంగా మోదీ పాలనపై చురకలు వేశారు.

Uddhav Thackeray: బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారు.. మోదీపై థాక్రే చురకలు..!

ముంబై: విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమి రెండ్రోజుల కీలక సమావేశం ముంబైలో ఈనెల 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ఘాటు విమర్శలు గుప్పించారు. బుధవారంనాడిక్కడ మీడియా సంయుక్త సమావేశంలో థాకరే మాట్లాడుతూ, దేశంలో సానుకూల మార్పులు, నియంతృత్వంపై పోరాటానికి తామంతా ఏకతాటిపైకి వచ్చినట్టు చెప్పారు. బ్రిటిష్ వాళ్లు కూడా అభివృద్ధి చేశారని, అయితే తాము అభివృద్ధితో పాటు స్వేచ్ఛ (Freedom)ను కోరుకుంటున్నామని పరోక్షంగా మోదీ పాలనపై చురకలు వేశారు. ఎల్‌పీజీ ధరల తగ్గింపుపై మాట్లాడుతూ, ఇండియా కూటమి సమావేశాలు ఎన్ని జరిగితే అంతగా మోదీ ప్రభుత్వం డిస్కౌంట్లు ఇస్తూ పోతుందన్నారు. చివరకు సిలెండర్లు ఉచితంగా ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.


28 పార్టీలు, 6 రాష్ట్రాల సీఎంలు...

ఇండియా కూటమి సమావేశంపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడుతూ, 28 రాజకీయ పార్టీలకు చెందిన 63 మంది నేతలు ముంబై సమావేశంలో పాల్గొంటున్నట్టు చెప్పారు. దేశంలో మార్పు తెచ్చేందుకు ఇదొక అవకాశమని ఆయన అన్నారు. ముంబై సమావేశంలో 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నట్టు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. బీహార్, బెంగళూరు సమావేశంలో పాల్గొన్న వారంతా ముంబై సమావేశంలో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఇండియా కూటమి గత రెండు సమావేశాలు చూసిన తర్వాతే కేంద్రపై ఒత్తిడి పెరిగి గ్యాస్ ధరలు తగ్గించిందన్నారు. రెండ్రోజుల సమావేశంలో పాల్గొనేందుకు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గురువారంనాడు ముంబై వస్తారని చెప్పారు.


దేశాన్ని కాపాడుకోవడమే మా బాధ్యత...

దేశాన్ని కాపాడుకోవడమే తమ కూటమి బాధ్యత అని కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు. 32 పార్టీలు 'ఇండియా ' కూటమిలో భాగస్వాములవుతున్నట్టు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు.

Updated Date - 2023-08-30T19:12:20+05:30 IST