Japan Vs China : తన వలలో తానే చిక్కుకున్న చైనా

ABN , First Publish Date - 2023-01-12T17:51:29+05:30 IST

అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లు ఉంది చైనా పరిస్థితి. పొరుగు దేశం భారత్‌ ఎదుగుదలను నిరోధించాలని

Japan Vs China : తన వలలో తానే చిక్కుకున్న చైనా
Joe Biden, Fumio Kishida, Xi Jinping

న్యూఢిల్లీ : అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లు ఉంది చైనా పరిస్థితి. పొరుగు దేశం భారత్‌ ఎదుగుదలను నిరోధించాలని అనేక వ్యూహాలను అమలు చేసినప్పటికీ, కాలక్రమంలో ఎదురు దెబ్బ తినవలసిన దుస్థితిని ఎదుర్కొంటోంది. భారత్‌పైకి తాను ఎగదోసిన దేశాలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోగా, గతంలో పెట్టుబడులు పెట్టిన జపాన్ ప్రస్తుతం అమెరికాతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. పైగా తనకే సవాలు విసురుతోంది. మరోవైపు ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియా, భారత్ వంటి దేశాల నుంచి ఒత్తిళ్ళను ఎదుర్కొనవలసి వస్తోంది.

అమెరికా, జపాన్ విదేశాంగ, రక్షణ మంత్రుల సమావేశం బుధవారం వాషింగ్టన్‌లో జరిగింది. అనంతరం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. చైనా నుంచి ఉభయులకు ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో భద్రతా సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ఇది వ్యూహాత్మక పోటీ జరుగుతున్న నూతన శకమని, అందువల్ల ఆధునికీకరించిన కూటమి దార్శనికతను ఇరు దేశాలు రూపొందించుకున్నట్లు తెలిపాయి.

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, తాము, తమ కూటమి పక్షాలు, భాగస్వాములు ఎదుర్కొంటున్న ఉమ్మడి వ్యూహాత్మక సవాలు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాయేనని తామంతా అంగీకరించామని తెలిపారు. అంతరిక్షానికి కూడా వర్తించే విధంగా తమ రక్షణ ఒప్పందాన్ని విస్తరించాలని నిర్ణయించామన్నారు. అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, జపాన్‌లో మెరైన్ లిట్టోరల్ రెజిమెంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. దీనివల్ల యాంటీ షిప్ మిసైల్స్ సహా చెప్పుకోదగిన యుద్ధ సామర్థ్యం వస్తుందని తెలిపారు. జపాన్‌లో అమెరికా దళాలను ఆధునికీకరించాలని నిర్ణయించినట్లు ఈ ఉమ్మడి ప్రకటన తెలిపింది. నిఘా, గస్తీ, యాంటీ షిప్, రవాణా సామర్థ్యాలను మరింత పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది.

అమెరికా, జపాన్ నేతల మధ్య గురువారం జరిగిన చర్చల సందర్భంగా, చైనా తనదిగా చెప్పుకుంటున్న సెంకాకు దీవులకు కూడా జపాన్-అమెరికా భద్రతా ఒప్పందంలోని అధికరణ 5 వర్తిస్తుందని పునరుద్ఘాటించారు. ఒకినావాలోని యొనగుని దీవుల్లో అమెరికా సైన్యం ఉండటానికి కూడా వర్తిస్తుందని తెలిపారు. దీంతో అమెరికా, జపాన్ కలిసి చైనాకు ఘాటైన సందేశాన్ని పంపించినట్లయింది.

ఫలితంగా భారత్, తైవాన్, ఆస్ట్రేలియాలకు వ్యతిరేకంగా చైనా ప్రదర్శిస్తున్న దూకుడును జపాన్ విషయంలో కూడా ప్రదర్శించవలసి వస్తుందనే విషయం ఈ ఉమ్మడి ప్రకటననుబట్టి తెలుస్తోంది. యుద్ధం, హింస సమర్థనీయం కాదని, అన్ని రకాల వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ భావించింది. ఈ భావనను ప్రస్తుతం సముద్రంలోకి విసిరేసినట్లు స్పష్టమవుతోంది. చైనా నుంచి తీవ్రమైన సవాలు ఎదురవుతోందని గుర్తించింది. అందుకు అనుగుణంగా జాతీయ భద్రతా విధానాన్ని సవరించుకుంది.

గతంలో ఏం జరిగింది?

1962నాటి యుద్ధం తర్వాత చైనా చాలా జాగ్రత్తగా భారత దేశానికి పొరుగున ఉన్న దేశాలతో సంబంధాలు పెట్టుకుంది. భారత దేశాన్ని చుట్టుముట్టేందుకు పన్నాగం పన్నింది. భారత దేశానికి న్యాయంగా దక్కవలసిన అంతర్జాతీయ పాత్రను దక్కకుండా నిలువరించడానికి భూటాన్ మినహా మిగతా పొరుగు దేశాలను ఉపయోగించుకుంది. పాకిస్థాన్, శ్రీలంక ఉగ్రవాదం, తదితర మార్గాల్లో భారత్‌ను దెబ్బతీయడంలో చైనాకు సహకరించాయి. శ్రీలంకలోని హంబంటోటా, కల్లోలిత ప్రాంతమైన బలూచిస్థాన్‌లలో నావికా దళ స్థావరాలను ఏర్పాటు చేసేందుకు చైనాకు సహకరించాయి. దీంతో భారత దేశం తన పొరుగు దేశాలతో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడంలోనే మునిగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో చైనా అంతర్జాతీయంగా తన పరిధిని పెంచుకుంది.

ప్రస్తుత పరిస్థితి

చైనా పన్నాగాలు కాలక్రమంలో బెడిసికొట్టాయి. గతంలో తనకు సహకరించిన భారత దేశ పొరుగు దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు జపాన్ క్వాడ్ (QUAD) గ్రూపులో వేగంగా బలపడుతోంది. ఈ గ్రూపులో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి.

దక్షిణ చైనా సముద్రానికి సంబంధించిన తీర్పు 2016 జూలై 12న వెలువడింది. ఇది ఫిలిప్పైన్స్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, చైనా దానిని అమలు చేయడానికి తిరస్కరించింది. దీనిని అమెరికా-జపాన్ తాజా ఉమ్మడి ప్రకటనలో ప్రస్తావించారు. తైవాన్‌పై తమ మౌలిక వైఖరిని కూడా వెల్లడించారు. హాంగ్ కాంగ్ స్వయంప్రతిపత్తి, చైనాలోని వీఘర్ సున్నీ ముస్లింల హక్కుల ఉల్లంఘన అంశాల్లో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా సవాళ్లను దీటుగా ఎదుర్కొనడానికి జపాన్ సిద్ధమైంది. భారత్ కూడా ఇదే విధంగా చైనాను ప్రతిఘటిస్తోంది. భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే గురువారం మాట్లాడుతూ, చైనా సైన్యాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు లడఖ్‌లో 1,597 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లో 55,000 మందిని, 400 గన్స్‌ను మోహరించామని తెలిపారు.

ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియాలతో సంబంధాలను భారత్, జపాన్ బలోపేతం చేసుకున్నాయి. ఫిలిప్పైన్స్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఈ దేశాలను మ్యాప్‌లో గుర్తిస్తే, చైనా గతంలో తాను వ్యతిరేకించే దేశాలను ముట్టడించడానికి పన్నిన వలలో ఇప్పుడు తానే చిక్కుకున్నట్లు స్పష్టమవుతోంది.

Updated Date - 2023-01-12T17:51:34+05:30 IST