Bengal poll violence: పంచాయతీ ఎన్నికల రద్దు కోసం హైకోర్టుకు కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-07-08T15:07:43+05:30 IST

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలింగ్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం, హత్యలు, బ్యాలట్ బాక్సుల లూటీ వంటి దారుణాలు జరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు చెల్లనివని ప్రకటించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరింది.

Bengal poll violence: పంచాయతీ ఎన్నికల రద్దు కోసం హైకోర్టుకు కాంగ్రెస్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పోలింగ్ సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసం, హత్యలు, బ్యాలట్ బాక్సుల లూటీ వంటి దారుణాలు జరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికలు చెల్లనివని ప్రకటించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరింది.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింస ప్రజ్వరిల్లిన నేపథ్యంలో ఈ ఎన్నికలు చెల్లనివని ప్రకటించాలని, దీనిపై అత్యవసర విచారణ జరపాలని తాను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ వినతిపత్రాన్ని సమర్పించానని కాంగ్రెస్ నేత కౌస్తవ్ బాగ్చి తెలిపారు.

పంచాయతీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జూన్‌లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హింస తీవ్ర స్థాయికి చేరింది. బాంబు దాడులు, వాహనాలను తగులబెట్టడం, ప్రత్యర్థులను హత్య చేయడం వంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఈ హింసాకాండలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, దీనిపై విచారణ జరపాలని బాగ్చి కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ఎటువంటి ఉల్లంఘనలు లేకుండా జరిగే విధంగా ఆదేశించాలని కోరారు.

క్షేత్ర స్థాయిలో గవర్నర్ పరిశీలన

పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు గవర్నర్ సీవీ ఆనంద బోస్ శనివారం ఉత్తర 24 పరగణాల జిల్లాలో పర్యటించారు. తాను చాలా మందితో మాట్లాడానని, ఓటు వేయడానికి వెళ్లాలని అనుకున్నవారిని గూండాలు ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని కొందరు తనకు చెప్పారన్నారు. ఎన్నికల సందర్భంగా హత్యలు జరుగుతున్నాయని, తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని మరికొందరు చెప్పినట్లు తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా పవిత్రమైన రోజు అని, రక్తపాతాన్ని ఆపాలని ప్రజలను, రాజకీయ పార్టీలను కోరారు. ఎన్నికలు బ్యాలట్ ద్వారా జరగాలని, బుల్లెట్ల ద్వారా కాదని చెప్పారు.

ఇదిలావుండగా, ఎన్నికల నేపథ్యంలో జరిగిన హింసాకాండలో నలుగురు టీఎంసీ కార్యకర్తలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఒక్కొక్కరు మరణించారు. తమపై ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు దాడులు చేశారని బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఆరోపించారు.

కేంద్ర బలగాల సమర్థత ప్రశ్నార్థకం : టీఎంసీ

ఇదిలావుండగా, కేంద్ర బలగాల సమర్థతను టీఎంసీ ప్రశ్నించింది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉందని ఆరోపించింది. మాల్డాలోని మణిక్చక్‌లో బాంబు దాడిలో తమ పార్టీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. నారాయణ్‌పూర్-1 గ్రామ పంచాయతీలో తమ పార్టీ అభ్యర్థిని హసీనా సుల్తానా భర్తపై సీపీఎం కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించింది. కేంద్ర బలగాలను మోహరించినప్పటికీ, సల్బరి-2 గ్రామ పంచాయతీలో తమ పార్టీ కార్యకర్తపై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆరోపించింది. తాజా సంఘటనల వల్ల కేంద్ర బలగాల సమర్థత, సన్నద్ధతలపై సందేహాలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపింది. ఎన్నికలు శాంతియుతంగా జరగడం కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీల మాటల్లో డొల్లతనం స్పష్టంగా బయటపడిందని తెలిపింది.

రెండు జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు లేవు

పశ్చిమ బెంగాల్‌లో మూడు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంది. 73,887 సీట్ల కోసం 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 22 జిల్లాల్లో గ్రామ పంచాయతీ స్థానాలు 63,229 కాగా, పంచాయతీ సమితి స్థానాలు 9,730. డార్జిలింగ్ కలింపోంగ్ జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగడం లేదు. ఈ జిల్లాల్లో గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్, సిలిగురి సబ్ డివిజినల్ కౌన్సిల్ ఉన్నాయి. 20 జిల్లాల్లో 928 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 8న ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రత కోసం 600 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. వీరితోపాటు దాదాపు 70 వేల మంది రాష్ట్ర పోలీసులు కూడా భద్రత చర్యల్లో పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi : పొలంలో దిగి, నాట్లు వేసి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ

West Bengal panchayat election : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. నలుగురు టీఎంసీ కార్యకర్తల హత్య..

Updated Date - 2023-07-08T15:07:43+05:30 IST