2024 polls: రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ కీలక సమావేశం.. ఎజెండా ఏమిటంటే..?
ABN , Publish Date - Dec 25 , 2023 | 06:46 PM
లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాలపై చర్చలను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర శాఖల నేతలతో డిసెంబర్ 29న చర్చలు జరుపనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విపక్షంలో ఉంది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమి సీట్ల పంపకాలపై (seat sharing) చర్చలను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర శాఖల నేతలతో డిసెంబర్ 29న న్యూఢిల్లీలో చర్చలు జరుపనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విపక్షంలో ఉంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడిలో కాంగ్రెస్ భాగస్వామి కాగా, పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీతో పాటుగా కాంగ్రెస్ కూడా విపక్ష పార్టీగా ఉంది.
దేశవ్యాప్తంగా అనుసరించనున్న పార్టీ కూటమి విధానాన్ని నిర్ణయించడంలో భాగంగా సంబంధిత రాష్ట్ర నేతలతో ఈనెల 29,30 తేదీల్లో ముకుల్ వాస్నిక్ సారథ్యంలోని కాంగ్రెస్ అలయెన్స్ కమిటీ అంతర్గత చర్చలు జరుపనుంది. డిసెంబర్ 29న మహారాష్ట్ర, పంజాబ్‌కు చెందిన పార్టీ నేతలతోనూ, డిసెంబర్ 30న ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ సహా ఇతర రాష్ట్రాల నేతలతోనూ చర్చలు జరుగుతాయి. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలతో పొత్తులపై ప్రధానంగా ఈ సమావేశాల్లో దృష్టి సారించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 25కు పైగా పార్టీలతో కూడిన విపక్ష 'ఇండియా' కూటమిలో కాంగ్రెస్ పార్టీతో పాటు జేడీయూ, ఆర్జేడీ, టీఎంసీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ, ఏఏపీ, డీఎంకే తదితర పార్టీలున్నాయి.