Karnataka : డీకే శివ కుమార్ జన్మదిన వేడుకలు.. సిద్ధరామయ్య హాజరు..
ABN , First Publish Date - 2023-05-15T10:22:46+05:30 IST
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి జరిగాయి.
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ సీనియర్ నేత, సీఎం పదవి కోసం పోటీ పడుతున్న సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 18న జరుగుతుందని తెలుస్తోంది.
డీకే శివ కుమార్ ఆదివారం రాత్రి 11.40 గంటలకు ఇచ్చిన ట్వీట్‌లో మే 15న తన జన్మదినోత్సవమని, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి తన పుట్టిన రోజును జరుపుకున్నానని తెలిపారు. తన జీవితం కర్ణాటక ప్రజలకు సేవ చేయడానికి అంకితమైందని చెప్పారు. తన జన్మదినోత్సవాల సందర్భంగా కర్ణాటక ప్రజలు తనకు అత్యుత్తమమైన బహుమతిని ఇచ్చారని తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.
ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేసే అధికారాన్ని సీఎల్‌పీ ఖర్గేకు కట్టబెట్టినప్పటికీ, ఈ పదవి కోసం పోటీ పడుతున్న సిద్ధరామయ్య, శివ కుమార్ న్యూఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కర్ణాటక కాంగ్రెస్ శాసన సభా పక్షం ఆదివారం బెంగళూరులోని ఓ హోటల్‌లో సమావేశమైంది. ముఖ్యమంత్రి పదవికి నేతను ఎంపిక చేసే అధికారాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు కట్టబెట్టింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో ముగ్గురు నేతలు పరిశీలకులుగా హాజరయ్యారు.
కాంగ్రెస్ కర్ణాటక ఇన్‌ఛార్జి రణదీప్ సింగ్ సుర్జీవాలా మాట్లాడుతూ, తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించడానికి ఖర్గే ఎక్కువ సమయం తీసుకోబోరని, త్వరలోనే ప్రకటిస్తారని చెప్పారు.
ఇదిలావుండగా, శివ కుమార్ జన్మదినోత్సవాల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఆయన మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసానికి సోమవారం వచ్చారు.
ఇవి కూడా చదవండి :
India and America : అమెరికాతో భారత్ వ్యూహాత్మక చర్చలు వచ్చే నెలలో
Church Pastor: కడుపు మాడ్చుకొని చనిపోతే జీసస్‌ను కలుస్తారు!