PM Modi : కుల గణనపై మోదీకి ఖర్గే లేఖ

ABN , First Publish Date - 2023-04-17T16:54:59+05:30 IST

కులాలవారీ జనాభా లెక్కలను సేకరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) డిమాండ్ చేశారు.

PM Modi : కుల గణనపై మోదీకి ఖర్గే లేఖ
Mallikharjun Kharge, Narendra Modi

న్యూఢిల్లీ : కులాలవారీ జనాభా లెక్కలను సేకరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) డిమాండ్ చేశారు. అర్థవంతమైన సాంఘిక న్యాయం, సాధికారత పథకాల అమలు కోసం విశ్వసనీయమైన డేటాబేస్ చాలా అవసరమని చెప్పారు. నమ్మదగిన సమాచారంతో తాజా కులాలవారీ జనాభా లెక్కలు లేకపోతే ముఖ్యంగా ఓబీసీలకు సాంఘిక న్యాయం, సాధికారత పథకాల అమలు అసంపూర్ణమవుతుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి ఓ లేఖ రాశారు.

పదేళ్లకోసారి సేకరించవలసిన జనాభా లెక్కలను 2021లో సేకరించి ఉండవలసిందని, కానీ అప్పట్లో జనాభా లెక్కలను సేకరించలేదని తెలిపారు. తక్షణమే జనాభా లెక్కల సేకరణను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమగ్ర కులాలవారీ జనాభా లెక్కలను దీనిలో అంతర్భాగం చేయాలని కోరారు.

తాజా సమాచారంతో కులాలవారీ జనాభా లెక్కలు తప్పనిసరి అని కాంగ్రెస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని, దీనిని పునరుద్ఘాటిస్తున్నానని ఖర్గే తన లేఖలో తెలిపారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ గతంలో మిగిలిన ప్రతిపక్ష నేతల మాదిరిగానే తాను, తన సహచరులు ఈ డిమాండ్‌ను అనేకసార్లు ప్రస్తావించామని గుర్తు చేశారు. సాంఘిక, ఆర్థిక, కులాలవారీ జనగణనను 2011-12లో మొదటిసారి యూపీఏ ప్రభుత్వం నిర్వహించిందని తెలిపారు. 25 కోట్ల కుటుంబాల సమాచారాన్ని సేకరించిందని చెప్పారు. 2014 మే నెలలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, ఇతర ఎంపీలు డిమాండ్ చేసినప్పటికీ, అనేక కారణాలతో కులాలవారీ జనగణన సమాచారాన్ని విడుదల చేయలేదన్నారు.

అర్థవంతమైన సాంఘిక న్యాయం, సాధికారత కార్యక్రమాల అమలు కోసం నమ్మదగిన డేటాబేస్ అవసరమని తెలిపారు. ఇది లేకపోతే ఆయా వర్గాలకు, మరీ ముఖ్యంగా ఓబీసీలకు ఈ పథకాలను అందజేయడం, సాంఘిక న్యాయం జరగడం అసంపూర్ణమవుతుందన్నారు. కులాలవారీ జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.

ఈ లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. తక్షణమే కులాలవారీ జనగణనను చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) కూడా ఇదే డిమాండ్ వినిపించారు. ఆయన కర్ణాటకలోని కోలార్‌లో ఆదివారం మాట్లాడుతూ, 2011 కులాలవారీ జనాభా లెక్కల వివరాలను విడుదల చేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Same-sex marriage : స్వలింగ వివాహాలపై పిటిషన్లను తోసిపుచ్చండి.. సుప్రీంకోర్టును కోరిన కేంద్రం..

Delhi: మోదీ సర్కారు 9 ఏళ్ల పాలనపై దేశవ్యాప్త ప్రచారం..

Updated Date - 2023-04-17T16:54:59+05:30 IST