Arvind Kejriwal: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇలాగే కొనసాగితే భారత్ ఎప్పటికీ విశ్వగురువు కాదు

ABN , First Publish Date - 2023-08-15T16:50:28+05:30 IST

కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..

Arvind Kejriwal: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్.. ఇలాగే కొనసాగితే భారత్ ఎప్పటికీ విశ్వగురువు కాదు

కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. మోదీని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సుదీర్ఘ సంభాషణలు ఇచ్చినంత మాత్రాన దేశం ఎప్పటికీ విశ్వగురువు కాదని.. మోదీ ప్రసంగాల్ని ఉద్దేశిస్తూ కౌంటర్ వేశారు. మన భారతదేశం అభివృద్ధి చెందాలన్నా, విశ్వంలో అగ్రగామిగా ఎదగాలన్నా.. మంచి పాఠశాలలు, విద్య, వైద్య సదుపాయాలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా కావాలన్నారు. మణిపూర్, హర్యానాలోని అల్లర్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.

కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘‘ఈరోజు స్వాంతంత్ర దినోత్సవం, ఇది సంతోషకరమైన దినం. నాకు.. ఏదో తెలియని బాధ నా మనసుని కలచివేస్తోంది. ఒక సహోదరుడు మరో సహోదరుడితో గొడవ పడుతున్నాడు. మణిపూర్‌లో రెండు వర్గాలకు చెందిన ప్రజలు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. మహిళల్ని వేధింపులకు గురి చేయడంతో పాటు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మణిపూర్ మండుతోంది. ఈ ఘోరాలు, అల్లర్ల వల్ల ఎవరు లాభపడుతున్నారు? ఇలాంటి అల్లర్ల నేపథ్యంలో భారత్ ఎలా విశ్వగురువుగా ఎదుగుతుంది? భారత్ విశ్వగురువుగా మారుతుందని రోజూ వింటూనే ఉన్నాం గానీ, ఆ దిశగా సంకేతాలు కనిపించడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చారు.


మన దేశంలో మొత్తం 140 కోట్ల జనాభా ఉందని, అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉంటేనే ప్రపంచంలో నంబర్ వన్‌గా ఎదుగుతామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘‘ఒక కుటుంబంలో పెద్ద దిక్కు అయిన తండ్రి చనిపోయినప్పుడు.. అతని కుటుంబంలోని సభ్యులు ఆస్తి కోసం గొడవ పడితే, ఆ కుటుంబం బాగుపడుతుందా? లేదు. ఇంకా చెప్పాలంటే.. తమతమ గొడవల మధ్య తండ్రి సంపాదించిన ఆస్తిని పూర్తిగా వృధా చేస్తారు. అదే గొడవ పడకుండా సామరస్యంగా సమస్యని పరిష్కరిస్తే.. అందరకూ దక్కాల్సింది దక్కుతుంది. అలాగే.. 140 కోట్ల మంది ఉన్న మనం.. ఓ కుటుంబంలా ఉంటేనే గ్లోబల్ లీడర్‌గా ఎదగొచ్చు’’ అంటూ కేజ్రీవాల్ ఓ మంచి ఉదాహరణ ఇచ్చారు.

ఇదే సమయంలో కేజ్రీవాల్ విద్యుత్ కోతల గురించి కూడా మాట్లాడారు. ప్రజలు రోజుకి 8 గంటలు చొప్పున విద్యుత్ సమస్యలు ఎదుర్కుంటున్నారని, ఇలాగైతే ఎలా విశ్వగురువుగా ఎదుగుతామని అడిగారు. ఢిల్లీలో ఎలాంటి విద్యుత్ కోతలు లేవని, ఢిల్లీ ప్రజలు విద్యుత్ జనరేటర్స్ కొనుగోలు చేయడం మానేశారని అన్నారు. తాను ప్రజలు ఉచితంగా పలు సౌకర్యాలు అందిస్తున్నందుకు తనని చాలామంది ఎగతాళి చేస్తున్నారని, కానీ వాటిని తాను పట్టించుకోనని అన్నారు. ఢిల్లీలో అమలవుతున్న ఉచిత విద్యుత్ కావాలో, లేక పెద్ద పారిశ్రామికవేత్తల రుణమాఫీ కావాలో దేశ ప్రజలు నిర్ణయించుకోవాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-08-15T16:50:28+05:30 IST