Court Summons: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు కోర్టు సమన్లు.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-09-22T15:41:17+05:30 IST
క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్(Tejaswi Yadav), మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav), మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ జులై 3న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన తాజా ఛార్జ్ షీట్(Charge Sheet)ను పరిగణనలోకి తీసుకుంటూ, అక్టోబర్ 4న తమ ముందు హాజరుకావాలని నిందితులందరికీ సమన్లు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి భూమి ఇవ్వాలనే షరతుతో జరిగిన కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్, రబ్రీ దేవి, తేజస్వీ యాదవ్‌తో పాటు మరో 14 మంది పేర్లతో సీబీఐ జులై 3న ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. లాలూను ప్రాసిక్యూట్ చేయడానికి ఈ నెల ప్రారంభంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి అనుమతి లభించిందని సీబీఐ గతంలో కోర్టుకు నివేదించింది.
ఆరోపణలివే...
ఆర్ జేడీ(RJD) చీఫ్ లాలూ అప్పటి యూపీఏ కూటమిలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఈ కుంభ కోణం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో భారతీయ రైల్వేలోని వివిధ జోన్లలో గ్రూప్ - డిలో అనేక మందిని నియమించారని.. వారు తమ భూమిని అప్పటి లాలూ కుటుంబ సభ్యులకు, బినామీలకు బదిలీ చేశారని సీబీఐ ఆరోపించింది. క్విడ్ ప్రోకోలో భాగంగా వందల ఎకరాల భూమి పరస్పరం బదిలీ అయిందని దర్యాప్తు సంస్థ వాదనా. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని యాదవ్ కుటుంబం ఆరోపించింది. తమ నేతపై వస్తున్న ఆరోపణలను ఆ పార్టీ ఖండించింది.