Kejriwal Summons : ఇద్దరు ఆప్ నేతల అరెస్ట్

ABN , First Publish Date - 2023-04-16T16:58:58+05:30 IST

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ

Kejriwal Summons : ఇద్దరు ఆప్ నేతల అరెస్ట్
AAP Leaders

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal)కు సీబీఐ (Central Bureau of Investigation-CBI) సమన్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేతలు రాఘవ్ చద్దా (Raghav Chadha), సంజయ్ సింగ్ (Sanjay Singh)లను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేసినవారిలో వీరితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిషి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన దాదాపు 1,500 మంది ఆప్ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బస్సుల్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లను వ్యతిరేకిస్తూ ఢిల్లీ వీథుల్లో కూడా ఆప్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. దీంతో వాహనదారులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలావుండగా, కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపేందుకు పంజాబ్ నుంచి వచ్చిన తమ పార్టీ నేతలు, మంత్రులను సింఘు సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. డాక్టర్ బల్బీర్ సింగ్, బ్రమ్ శంకర్ జింప, హర్‌జోత్ సింగ్ బెయిన్స్, కుల్జిత్ రణధవా, ఎమ్మెల్యే దినేశ్ చద్దా తదితరులను ఢిల్లీ నగరంలోకి అడుగు పెట్టనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మోదీకి భయం

ఢిల్లీ రాష్ట్ర మంత్రి అతిషి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రజాదరణ పెరుగుతుండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) భయపడుతున్నారని చెప్పారు. తమ పార్టీ నేతలను జైళ్లకు తరలించడానికి కారణం ఇదేనని తెలిపారు. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారని, కనీసం ఒక రూపాయి అవినీతిని అయినా నిరూపించలేకపోతున్నారని మండిపడ్డారు. యావత్తు దేశం అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉందని చెప్పారు.

దేశ వ్యతిరేక శక్తులు

కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) ఆదివారం ఉదయం 11.40 గంటలకు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI) కార్యాలయంలో హాజరయ్యారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొన్ని దేశ వ్యతిరేక శక్తులు భారత దేశం అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని ఆరోపించారు. అయినప్పటికీ దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని ఆ శక్తులకు తాను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు. కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు ఆప్ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, తదితర నేతలు ఉన్నారు. అనంతరం వీరంతా కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించి, ప్రార్థనలు చేశారు.

ప్రతి ప్రశ్నకు జవాబు

సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు కేజ్రివాల్ విడుదల చేసిన వీడియోలో, సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని సష్టం చేశారు. తనను అరెస్టు చేస్తారంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, అధికార మదంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘మా మాట వినాలి.. లేదంటే జైల్లో పెడతాం’ అనే తరహాలో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తానని తెలిపారు. ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం రాజకీయాల్లోకి అడుగులు వేశానన్నారు. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. తనను జైల్లో పెడతామంటూ పదేపదే బెదిరిస్తున్నారన్నారు.

ఇవి కూడా చదవండి :

MS Dhoni: వీరాభిమానిని కలిసిన ధోనీ.. మురిసిపోయిన ఖుష్బూ.. ఆమె ట్వీట్ వైరల్!

Karnataka : కర్ణాటక ఎన్నికల ముందు బీజేపీకి ఊహించని షాక్..

Updated Date - 2023-04-16T16:58:58+05:30 IST