Delhi liquor policy: లిక్కర్ స్కాం కేసు నిందితుల జాబితాలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’?

ABN , First Publish Date - 2023-10-05T13:25:33+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కసరత్తు చేస్తుందని సమాచారం.

Delhi liquor policy: లిక్కర్ స్కాం కేసు నిందితుల జాబితాలో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’?

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కసరత్తు చేస్తుందని సమాచారం. నిందితుల జాబితాలో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చాలా వద్దా అన్న అంశంపై ఈడీ విభాగంలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీని చేర్చాలా వద్దా అనే అంశంపై ఈడీ న్యాయపరమైన అభిప్రాయాలను కూడా తీసుకున్నట్టు సమాచారం. న్యాయవాదులు చెప్పే దానిని బట్టి ఈ అంశంపై ఈడీ ముందుకు వెళ్లనుందని తెలుస్తోంది. కాగా ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా మద్యం పాలసీ వల్ల పార్టీకి లబ్ధి చేకూరిందని కేసు నమోదు చేసినందున, ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని ఈడీ ప్రశ్నించింది.


‘‘మీ మొత్తం కేసు ఏమిటంటే ప్రయోజనాలు ఒక రాజకీయ పార్టీకి చెందాయి. ఆ రాజకీయ పార్టీ ఇప్పటికీ నిందితుల జాబితాలో లేదు. దానికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? మీ ప్రకారం రాజకీయ పార్టీ లబ్ధిదారు" అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ భట్టి ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది. కేబినెట్ నోట్‌ను న్యాయస్థానం పరిశీలించవచ్చా అని కూడా కోర్టు ప్రశ్నించింది. "కేబినెట్ నోట్లను పరిశీలించకుండా నిర్దిష్ట రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఢిల్లీకి ఇది వర్తిస్తుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతం." అని జస్టిస్ ఖన్నా అన్నారు. ఈడీ తరపున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు ఈ రెండు ప్రశ్నలకు ఈ రోజు సమాధానం ఇవ్వనున్నారు. కాగా ఈ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-10-05T13:25:33+05:30 IST