Maharashtra : శరద్ పవార్‌పై మహారాష్ట్ర సీఎం షిండే సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-21T19:15:00+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) శనివారం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.

Maharashtra : శరద్ పవార్‌పై మహారాష్ట్ర సీఎం షిండే సంచలన వ్యాఖ్యలు
Sharad Pawar, Eknath Shinde

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde) శనివారం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. సహకార రంగానికి పవార్ గొప్ప సేవలందించారని, ఆయన చేసిన సేవలు ఉపేక్షించదగినవి కాదని అన్నారు. ఆయన రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనుభవంగల నాయకుడని చెప్పారు. పుణేలోని వసంత్ దాదా సుగర్ ఇన్‌స్టిట్యూట్ (VSI) వార్షిక సాధారణ సమావేశంలో వీరిద్దరూ పాల్గొన్నారు.

అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం మార్గదర్శనం చేయడానికి, సలహాలు ఇవ్వడానికి పవార్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని షిండే తెలిపారు. తనకు సలహాలివ్వడానికి ఆయన తరచూ ఫోన్ చేస్తూ ఉంటారన్నారు. దేశాభివృద్ధిలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ రంగం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందన్నారు. మహారాష్ట్రలోని సహకార రంగానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పిందన్నారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన కలిసి మహా వికాస్ అగాడీగా ఏర్పడి 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే 2021లో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, ఆ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఈ తిరుగుబాటుకు ఏక్‌నాథ్ షిండే నాయకత్వం వహించారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి షిండే వర్గం ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పరిపాలిస్తోంది.

Updated Date - 2023-01-21T19:15:03+05:30 IST