Karnataka Elections: సోనియా వ్యాఖ్యలపై ఈసీ కన్నెర్ర
ABN , First Publish Date - 2023-05-08T21:06:27+05:30 IST
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిన కర్ణాటక సార్వభౌమాధికారం(Karnataka's sovereignty) వ్యాఖ్యలపై...
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) చేసిన కర్ణాటక సార్వభౌమాధికారం(Karnataka's sovereignty) వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని (Congress president) కోరింది.
అంతకు ముందు సోనియాగాంధీ తన ప్రసంగంలో 'సార్వభౌమాధికారం' అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం తెలిపిన బీజేపీ (BJP) ఎంపీలు... ఎన్నికల కమిషన్ (Election Commission)కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాందీపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఈసీఐని బీజేపీ ప్రతినిధి బృందం కోరింది.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Congress parliamentary party chairperson Sonia Gandhi) కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పుగా పరిణమించే ఎవరినీ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదని కాంగ్రెస్ పార్టీ మే 6న ఒక ట్వీట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు.
సోనియాగాంధీ 'సార్వభౌమాధికారం' అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే వాడినట్టు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) విమర్శించారు. ఆమెపై ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే సైతం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సార్వభౌమాధికారం పదాన్ని దేశానికి మాత్రమే ఉపయోగిస్తారని, సోనియాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు భూపేంద్ర యాదవ్ సారథ్యంలోని బీజేపీ ప్రతినిధుల బృందం ఎన్నికల సంఘాన్ని ఆదివారంనాడు కలిసింది. జితేంద్ర ప్రసాద్, తరుణ్ చుగ్, అనిల్ బలూని, ఓం పాఠక్‌లు ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు.
కాగా, మైసూరు జిల్లాలో ఆదివారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి మోదీ సైతం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 'టుక్డే-టుక్డే గ్యాంగ్' జబ్బు ఇప్పుడు కాంగ్రెస్ అత్యున్నత స్థాయికి కూడా చేరిందని విమర్శించారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేసే విధంగా కాంగ్రెస్ 'రాయల్ ఫ్యామిలీ' ఎప్పుడూ ముందే ఉంటుందని, ఇలాంటి ఆటలను దేశం ఎప్పటికీ క్షమించదని అన్నారు. దేశంలోని రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్ రాయల్ ఫ్యామిలీ, విదేశీ శక్తుల జోక్యాన్ని కూడా కోరుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇండియాను ద్వేషించే విదేశీ దౌత్యవేత్తలను కాంగ్రెస్ రహస్యంగా కలుసుకుంటోందని, దేశ సార్వభౌమాధికారానికి తలవంపులు తెచ్చే పనులకు మళ్లీ మళ్లీ పాల్పడుతోందని తూర్పారబట్టారు.
మరోవైపు కాంగ్రెస్ అవినీతిపై (corrupt advertisement) బీజేపీ అడ్వర్‌టైజ్‌మెంట్‌పై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా ఈసీ స్పందించింది. ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిని ఆదేశించింది.