Assembly elections: తెలంగాణతోపాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడే షెడ్యూల్ విడుదల
ABN , First Publish Date - 2023-10-09T08:56:58+05:30 IST
త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నేడు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది.
త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం నేడు మధ్యాహ్నం 12 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ షెడ్యూల్‌లో పోలింగ్ తేదీలు, ఎన్నికలు జరిగే దశల సంఖ్య, నామినేషన్ల దాఖలు తేదీలు, ఉపసంహరణ తేదీలను ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లోని శాసన సభల కాలపరిమితి డిసెంబర్ 2023, జనవరి 2024 మధ్య ముగియనుంది. ఎన్నికల సంఘం సాధారణంగా శాసనసభ గడువు ముగియడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తుంటుంది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. దీంతో కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీలతో సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారనున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉన్నాయి. నవంబర్ రెండవ వారం, డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు ఇది వరకే తెలిపాయి. 2018లో మాదిరిగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణలో ఒకే దశలో పోలింగ్ ఉండవచ్చని ఈసీ వర్గాల ద్వారా తెలిసింది. 2018 మాదిరిగా ఈ సారి కూడా ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే మొత్తం ఐదు రాష్ట్రాలకు పోలింగ్ తేదీలు వేర్వేరుగా ఉండే అవకాశాలున్నాయి.